నగరం లో కురిసిన వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరమ్మత్తు చర్యలను వెంటనే చేపట్టాలని నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం నగర మేయర్ వర్ష ప్రభావ ప్రాంతాలలో చేపడుతున్న తక్షణ సహాయక చర్యలను వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ అంబర్ పేట, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్ ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల పై ఏర్పడిన గుంతలు, చెడిపోయిన రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని జోనల్ కమిషనర్ల ను ఆదేశించారు. వర్షాల వలన పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు తొలగించడం తో పాటుగా ఆ ప్రాంతాల్లో ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జోనల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు చీఫ్ ఇంజనీర్లతో పాటు ఇంజనీర్ అధికారులు మోటర్ సైకిళ్లపై క్షేత్ర స్థాయిలో పర్యటించి గుంతలు, చెడిపోయిన రోడ్లు, త్రాగు నీటి వసతి ఇబ్బందులను గుర్తించి తక్షణ మరమ్మత్తులు చేపట్టాలని ఈ విషయంలో ఎవ్వరూ కూడా అజాగ్రత్త, నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.
విరిగిన చెట్ల తో పాటుగా వీధి దీపాలు ఆటంకంగా ఉన్న చెట్లను గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. పునరావస కార్యక్రమాలు, మరమ్మతులు చేపట్టే చర్యలతో పాటుగా వినాయక చవతి ఏర్పాట్లపై జోనల్ కమిషనర్లతో మేయర్ తన ఛాంబర్ లో సమీక్షించారు. వినాయక మండపాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కమిటీ సభ్యులకు సహకారం అవసరం ఉంటుందని అన్నారు. ప్రతి మండపం వద్ద ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు తీవ్రంగా కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిహెచ్ఎంసి అధికారులందరూ కార్లను వదిలి మోటర్ సైకిళ్లపై తిరిగి గుంతలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ శానిటేషన్ బి.సంతోష్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, అశోక్ సామ్రాట్, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మమత, చీఫ్ ఇంజనీర్ శ్రీదర్, డిప్యూటి కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.