• జనసేన మాత్రమే జనం నుంచి పుట్టిన పార్టీ
• కాంగ్రెస్ ని తరిమికొట్టాలన్న చంద్రబాబు ఈ రోజు వాళ్ళ చెప్పులు మోస్తున్నారు
• ప్రజల కన్నీరు తుడవలేని అధికారం ఎందుకు?
• జగన్ కు అసెంబ్లీకి వెళ్లాలంటే భయం
• చంద్రబాబు, జగన్…. వీళ్లలో ఎవరు పాలన చేసినా అవినీతిమయమే
• ధర్మం తప్పిన ఎవరైనా దెబ్బ తినక తప్పదు
• నీతి, ధర్మం అనే పునాదులపై ఉద్భవించినదే జనసేన
• మండపేట బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
ప్రజలకు అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేని పాలన అందించడమే ధ్యేయంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. పెచ్చుమీరిపోయిన అవినీతిని పెకలించివేయాలన్నా, దోపిడీ వ్యవస్థలు పోవాలన్నా జనసేన ప్రభుత్వం రావాలి, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. రాజకీయాల్లో పేరుకుపోయిన చెత్తను ఏరిపారేసి, కుళ్లును కడిగేయడమే లక్ష్యమన్నారు. నీతి, ధర్మం అనే పునాదులపై జనసేన పార్టీ ఉద్భవించింది అని తెలిపారు. శుక్రవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నిర్వహించిన ప్రజాపోరాట యాత్రలో శ్రీ పవన్ కల్యాణ్ గారు పాల్గొన్నారు. భారీయెత్తున ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రసంగిస్తూ “మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నన్నూ సిఎంని చేయమని జగన్ అంటారు. నాది 40 ఏళ్ల అనుభవం అని చంద్రబాబు అంటారు.
వీళ్ళకి పదవిపై వ్యామోహం తప్ప ప్రజల బాధలు, కష్టాలు తీర్చడం మీద దృష్టి లేదు. రాజకీయాలను నేను ఆటవిడుపుగా భావించను. బాధ్యతగా భావిస్తాను. ముఖ్యమంత్రి నాలుగు దశాబ్దాల అనుభవం రాష్ట్రానికి ఏమి ఉపయోగపడింది? తెలంగాణ నుంచి పారిపోయిరావడానికి మాత్రమే ఉపయోగపడింది. జగన్ కు తెలంగాణలో తిరిగే ధైర్యం లేదు. ఒక్క జనసేన, పవన్ కల్యాణ్ లకు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లో.. దేశంలో ఎక్కడైనా ప్రజల ముందుకు వెళ్ళే దమ్ము ఉంది. ఎందుకంటే జనసేన నిబద్ధత, నీతి నిజాయతీలు అందరికీ తెలుసు.
నా దృష్టిలో కనిపించే దేవుడు రైతు. మనకు అన్నం పెట్టినవాడే నిజమైన దేవుడు. గోదావరి, కృష్ణా నదులు పెట్టుకుని రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తెచ్చాయి ఇప్పటివరకు పరిపాలించిన ప్రభుత్వాలు. ప్రజల కన్నీళ్లు తుడవలేని పాలన, అధికారం ఎందుకు? పాలకులు ఎందుకు? మనం వేసే ఓటు విలువ ఒక నోటుకు అమ్ముడుపోతే, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కాలరాసిన వాళ్ళం అవుతాం. అవినీతి కోటలను బద్దలుకొట్టేందుకు పుట్టింది జనసేన. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారిలా వేల కోట్లు దోచుకునేందుకు రాలేదు. ఈ అవినీతిపరులను, కుల రాజకీయాలు చేసే వ్యక్తులను ఎదుర్కొని నిలబడగలరా అంటే నిలబడగలం అని నిరూపించాం. పడిన ప్రతి సమ్మెట దెబ్బకి రాటుదేలి పదునెక్కుతాం.. లేచి నిలబడతాం. అంతే కానీ భయపడి పారిపోవటానికి రాలేదు. ప్రజలకు అండగా నిలబడలేనప్పుడు రాజకీయలెందుకు. ప్రజల కోసం పని చేసేది రాజకీయాలు కానీ ప్రజలను దోచుకునేవి కాదు. ఒక రైతు కన్నీరు తుడవగలిగితే, ఒక ఆడపడుచుకి అన్నగా అండనిస్తే, ఓ దివ్యాంగుడికి గూడునిస్తే చాలు నా జన్మ సార్థకం అయినట్టే. ముఖ్యమంత్రులు ఏళ్లుగా చేసిన తప్పులకు- ఆంధ్ర ప్రజల్ని తెలంగాణలో నిందిస్తున్నప్పుడు ప్రజల తరపున వీళ్ళేవారూ మాట్లాడలేదు. చేయని తప్పుకు మనం ఎందుకు శిక్ష అనుభవించాలి. నేను తమిళనాడులో ఒక్కటే చెప్పాను- తల తెగి ఎగిరిపోయినా కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని. ఎదురు నిలబడి ఈ అవినీతి రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పోరాడుతాను. నా తరం దెబ్బతింది. మరి నా ఆడపడుచులు, నా అన్నదమ్ములు, నా తోటి ప్రజలు పడే బాధలు తీర్చేందుకు అండగా ఎవరు ఉంటారు అని నన్ను నేను ప్రశ్నించుకొని వచ్చా.
• ఎంపీలకి కాంట్రాక్టులు వస్తే చాలు అనుకొంటున్నారు
ఇక్కడకు వస్తుంటే ఓ.ఎన్.జి.సి. కంపెనీ పని చేస్తూ కనిపించింది, ఇక్కడి వనరుల్ని తరలించుకుంటూ, అడ్డగోలుగా దోచేస్తుంటే , ఇక్కడి యువత ఉపాధి లేక రోడ్ల మీదకు పడుతుంటే మన నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం మాట్లాడటం లేదు. వాళ్ళకి రావాల్సిన కాంట్రాక్టులు వస్తే చాలు అనుకొంటున్నారు. ఈ అవినీతి, దోపిడి వ్యవస్థ మారాలంటే ఇటువంటి దోపిడీ రాజకీయ నేతలు పనికిరారు, 2019 లో జనసేన ప్రభుత్వం రావాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యి తీరాలి,
కడియం రైతులు ఒక అంగుళం మట్టి తీస్తే మైనింగ్ అధికారులు కేసులుపెడతారు. కానీ మండపేట నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే, తెలుగు దేశం నాయకులు చెరువుల్లో మట్టిని నీరు చెట్టు అని అడ్డగోలుగా తవ్వేసుకుంటారు. ఇసుక తవ్వేస్తున్నారు. ప్రతిదానికీ ఒక హద్దు ఉంటుంది. వీళ్ళ అవినీతికి మాత్రం హద్దు లేకుండాపోతోంది. ఇలా అడ్డగోలుగా మీరు దోచేస్తారు అని తెలిస్తే నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేవాడిని కాదు. 2019లో తాము మళ్ళీ రావాలని ముఖ్యమంత్రి అంటున్నారు. మళ్ళీ వస్తే ఏమవుతుంది… గోదావరి తీరంలో ఇసుక కాదు ఆ తీరమే లేకుండా చేస్తారు. చెరువుల్లో మట్టి ఉండదు. ధర్మం తప్పినవాళ్ళు చింతకాయల్లా రాలిపోతారని అవదూత వెంకయ్యస్వామి చెప్పారు. ధర్మం తప్పినవాళ్ళు దెబ్బ తినక తప్పదు.
లోకేష్ గారు.. మీ నాన్న గారు మీ తాత గారిని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు, అది మీ కుటుంబ వ్యవహారం కాదు. అన్ని తెలిసి కూడా ఏదో మంచి చేస్తారు అని మీకు మద్దతిస్తే మీరు నిలువునా దోచేస్తున్నారు. నేను చెన్నైలో కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయనను ఎవరూ నమ్మవద్దు అని చెప్పాను. చంద్రబాబు గారు రోజుకో మాట చెబుతారు. మోదీ కంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరు అని అంటారు, మళ్ళీ మోదీ చెడ్డవారు అని అంటారు.
కాంగ్రెస్ తో 30 ఏళ్ళు శత్రుత్వం పెట్టుకొని ఈరోజు వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. కాంగ్రెస్ ని తరిమికొడతాం అని చెప్పిన వ్యక్తి ఈరోజు వాళ్ళ చెప్పులు మోస్తున్నారు. టీడీపీ నాయకులకు సిగ్గు లేదా? తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు.
• డీజీపీదే బాధ్యత
రాజానగరం సభకు వెళ్తుంటే నా కాన్వాయ్ లో నా వాహనం దాటాక – నా సెక్యూరిటీ ఉన్న వాహనాన్ని ఇసుక లారీ గుద్దేసింది. ఎనిమిదిమంది గాయపడ్డారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ లో మన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు ఇంటికి వెళ్తుంటే ఇసుక లారీ గుద్దింది. నాలుగు గంటల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదాలపై మేము రాజకీయాలు చేయడం లేదు. అవి కాకతాళీయం కాదు. కోడి కత్తితో గాయం చేస్తే ఎంత చేశారో తెలుసు. మేం మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా బలంగా ఎదుర్కొంటాం. మనోహర్ గారికి సెక్యూరిటీ ఇవ్వాలి అని నెల రోజుల కిందటే ప్రభుత్వాన్ని కోరాం. డీజీపీ పట్టించుకోలేదు. నాకుగానీ, మా నాయకులకిగానీ ఏదైనా జరిగితే డీజీపీ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అది శాంతిభద్రతల సమస్యగా మారకుండా చూసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి, లోకేశ్ గారికీ చెబుతున్నా – వెనక నుంచి ఇసుక లారీలతో గుద్దితే భయపడం. భరిస్తాం, సహిస్తాం. అందరం అమరావతిలో ఉండేవాళ్ళమే. తప్పకుండా లెక్కలు చూసుకుందాం” అన్నారు.