బిజెపి తీర్థం పుచ్చుకున్న తీన్మార్ మల్లన్న..

తీన్మార్ మల్లన్న అలియాన్ చింతపండు నవీన్ బిజెపి తీర్థం పుచ్చుకున్నాడు. మంగళవారం దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్ ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మల్లన్నకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మల్లన్న మాట్లాడుతూ… చింతపండు నవీన్ ను ప్రజలు తీన్మార్ మల్లన్న చేశారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని అన్నారు. తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అని మండిపడ్డారు. తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించిందేంటని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన ధ్యేయమని .. బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపారు.

జ్యోతిష్యుడిని బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో తీన్మార్ మల్లన్న కొంతకాలం క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మల్లన్నకు బీజేపీ అండగా నిలిచింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆయన్ని జైలులో కలిసి ధైర్యం చెప్పారు. తీన్మార్ మల్లన్నపై తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆయన భార్యను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. మల్లన్న బీజేపీలో చేరతారని అర్వింద్ చాలారోజుల క్రితమే మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు మల్లన్న బిజెపి కండువా కప్పుకున్నారు.