2019 నాటికి డ్వాక్రా మహిళల్లో నూరు శాతం అక్షరాస్యత సాధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సోమవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో గ్రామీణాబివృద్దిపై జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఇంటికి ఒక మహిళ ఈ-లిటరేట్ కావాలి. అక్షరాస్యత మరింతగా పెంపొందాలి, నైపుణ్యాలు పెంచుకుని మహిళలు వ్యాపారదక్షులు కావాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే పెట్టుబడి నిధి కింద డ్వాక్రా సంఘాలకు రూ,3,000 ఇచ్చిన విషయం గుర్తుచేశారు. ఇసుక రీచ్ ల బాధ్యతలు అప్పగించామని, త్వరలోనే అన్నసంజీవని, ఫుడ్ క్యాంటిన్లు వారి ద్వారానే ప్రారంభిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో మహిళల జీవనోపాధులు మెరుగుపర్చడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యంగా పేర్కోంటూ, ప్రతి మహిళ నెలసరి ఆదాయం రాబోయే నాలుగేళ్లలో రూ.10 వేలకు పెరగాలన్నారు.అక్టోబరు 2 నుంచి రాష్టంలోని మహిళల్లో చైతన్యం పెంచేందుకు మహిళా సాధికార యాత్ర చేపట్టాలన్నారు. గ్రామస్థాయిలో డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చి బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా వారు వ్యవహరించేందుకు తోడ్పడాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో గ్రామ స్థాయిలో ఎస్ హెచ్ జీలు నిల్వకేంద్రాలను నిర్వహించి, గిరాకీ ఉన్నప్పుడు పట్టణాలకు సరఫరా చేసి రాబడి పెంచుకునేలా చూడాలన్నారు. కాలక్రమేణా మహిళాసంఘాలే ప్రజా పంపిణీ వ్యవస్థకు కావలసిన ధాన్యాన్ని సరఫరా చేసేలా ప్రోత్సహించాలన్నారు. పారిశుద్ద్యానికి దోహదపడడంతోపాటు, సహజ ఎరువుగా కూడా ఉపయోగపడే వర్మి కంపోస్టు వాడకాన్ని ప్రోత్సహించేందుకుగాను, ప్రతి గ్రామంలో మహిళా సంఘాలకు సబ్సిడీని కొనసాగించాలని సీఎం సూచించారు. గ్రామాలలో వ్యవసాయ యంత్రపరికరాలను అద్దెకు తిప్పి మహిళా సంఘాల సభ్యులు రాబడి పొందేలా చూడాలని, వ్యవసాయ యంత్రపరికరాల తయారీదారులు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించు కోవాలని అధికారులకు సూచించారు. పర్యాటకం, ఆతిథ్య రంగాలలో మహిళలకు తర్ఫీదునిచ్చి వారు ఆ రంగంలో కీలక పాత్ర పోషించేలా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80లక్షల సభ్యత్వం, రూ.14 వేల కోట్లు కార్పస్ నిధులున్న స్వయం సహాయక బృందాలు మనకున్న గొప్ప వేదిక అంటూ, వారిని ఒక్కో రంగంలో తర్ఫీదు నిచ్చి స్వావలంబనకు దోహద పడాలని ముఖ్యమంత్రి కోరారు.
ధాన్యం, మొక్కజొన్న సేకరణ ద్వారానే కాకుండా టెక్స్ టైల్స్, గొర్రెల పెంపకం, క్యాటీన్ల నిర్వహణ ద్వారా డ్వాక్రా మహిళల ఆదాయం పెంచేందుకు దృష్టి పెట్టామని, 150 అన్న సంజీవని జెనెరిక్ మందుల దుకాణాలను ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించినట్లుగా సెర్ఫ్ సీఈవో ఆరోఖ్యరాజ్ తెలిపారు.ఈ భేటీలో మంత్రి మృణాళిని, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు పాల్గొన్నారు.