లాంగ్ లివ్ మహాత్మా !!

mahatma-gandi

ఈ జయంతులు, వర్దంతులు ఎవరు కనిపెట్టారో గానీ వాళ్ళకు అందరం జీవితాంతం రుణపడి వుండాలి. అవే కనుక లేకపోతే కనీసం ఏడాదికి ఒకటి రెండు సార్లయినా మహానుభావులను మనం తలచుకోం…. ఇవాళ మహాత్మా గాంధీ గారి జయంతి కావటంతో చాలా మందికి సడెన్ గా ఆయన గుర్తొచ్చారు. ఆయన గుర్తుకు రావటంతో మన జాతీయ గీతాలు గట్రా కూడా గుర్తొచ్చాయి. పాడేసుకున్నాం.. ఆయన గొప్పతనంగురించి తెగమాట్లాడేసుకున్నాం. . క్రమేపీ కొన్ని కనుమరుగు అవుతున్నట్లే ఈ జయంతులు కూడా కనుమరుగు అయితే అసలు గాంధీ అంటే ఎవరో తెలియని జనరేషన్ ఒకటి తయారవుతుంది. ఆ ముచ్చట కూడా ఎంతో కాలం లేదని నా ఉద్దేశ్యం. ఇప్పటికే మహాత్మాగాంధీని చూపించి ఈయన ఎవరు అని కొంత మంది పిల్లల్ని అడిగితే బరాక్ ఒబామా అనిచెప్పినట్లు మనం టివీల్లో చూస్తున్నాం. గాంధీ గారి అదృష్టం ఏవిటంటే మన కరెన్సీ నోట్ల మీద ఆయన బొమ్మ ముద్రించటం… అందుకే ఒకప్పుడు కరప్షన్ ను చూస్తే గుర్తొచ్చే గాంధీ గారు ఇప్పుడు కరెన్సీని చూస్తే గుర్తొస్తున్నారు. అది కరెన్సీచేసుకున్న పుణ్యమో బాపూజీ చేసుకున్న పుణ్యమో తెలియదు కాని ప్రతీరోజూ కరెన్సీ అవసరంతో బాటు పరోక్షంగా గాంధీగారి అవసరం కూడా అందరికీ కావాల్సివస్తోంది. అంటే కరెన్సీ లోను గాంధీ గారి ముఖం లోనూ చాలామందికి లక్ష్మికళ కనిపిస్తుంటుందన్నమాట… కంగ్రాట్స్ మహాత్మా..

గుడ్డిలో మెల్లన్నట్టు ఆ మధ్యన గాంధీ వర్ధంతి సందర్భంగా కొన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నడుం బిగించాయి. ఇది ఎంతో కొంత శుభపరిణామమే. అవినీతి విషయంలో చెప్పేవాడికంటే వినేవాడికి ఎక్కువ చిత్తశుద్ధి, విత్తశుద్ధి వుండాలి.. మదర్స్ డే, ఫాదర్స్ డే ల్లాగానే కరప్షన్ డే లాంటిది ఒకటి పెట్టాలన్నది ఒక భారతీయుడిగా నా ప్రతిపాదన… అంటే ఆ ఒక్కరోజులో మొత్తం కుమ్మేసుకొమ్మని నా ఉద్దేశ్యం కాదు. కనీసం ఆ ఒక్క రోజయినా దేశం మొత్తం మీద ఏ ఒక్కరు అవినీతికి పాల్పడకుండా వుంటే ఈ దేశంలో సగం దరిద్రం తగ్గుతుందేమోనని నా పిచ్చి ఆశ. ఆ రోజూ ఎప్పటికి వస్తుందో..! అసలు వస్తుందా..? చూద్దాం..

ఇంతకీ నా సొద ఏవిటంటే… ఎవరయినా గాంధీ గారి బొమ్మ వున్న ఓ కరెన్సీ నోటు దొరికితే వెంటనే దాన్ని తన జేబులో బంధిస్తాడు. అది తన దగ్గర వున్నంతకాలం తన ఆస్తి. వాడికి అవసరం వచ్చేంతకాలం వాడి జేబులో మహాత్ముడు బందీయే.. వాడి జేబులో ఉన్నంత కాలం గాంధీ గారి బొమ్మ వున్న సదరు నోటుకు వాడే బాస్. అయితే కొంతమంది జేబుల్లో వున్న కొన్నినోట్ల గురించి నేను పెద్దగా దిగులు పడటం లేదు. స్విస్ బ్యాంకులో బందీలుగా వున్న షుమారు 32 లక్షల 75 వేల కోట్ల మంది మహాత్మా గాంధీ లను ఎవరు విడుదల చేస్తారు.? ఎవరు బాధ్యత తీసుకుంటారు..? బాధ్యత తీసుకోవలసిన దేశ పెద్దలే చేతులెత్తేశారు.. మా వల్ల కాదన్నారు…. ఆ జాబితా బయటకు తీస్తే చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయంటూ ప్రకటించారు. ఇక గాంధీ గారికి దిక్కెవరు…? ఆయన్ను ఎవరు బయటకు తీసుకువస్తారు…? ఆయనకు స్విస్ బ్యాంక్ కారాగార విముక్తి ఎన్నాళ్ళకు…? అని బ్లాక్ మనీ రూపంలో వున్న ఈ నల్ల గాంధీ ని అడిగితే తెల్ల ముఖం వేయటం మినహా ఆయన మాత్రం చేసేది ఏముంది….? ఆయన్ను ఎవరయినా బయటకు తీసుకు వస్తారా… లేక తన చేతిలో వున్న కర్రను వెనక్కు తిప్పి తలా నాలుగు పీకుతూ తనంత తనే బయటకు వస్తాడా అన్నది వేచి చూడాల్సిన అంశం.

పాపం పిచ్చి గాంధి…. తాను తెచ్చిన స్వాతంత్ర్యాన్ని తన వారసులు ఎంచక్కా సద్వినియోగపరచుకుని ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడతారని ఆశపడివుంటాడు. పోయి బతికిపోయాడు గాని వర్తమాన భారతాన్ని చూసి ఆయన ఎంతగా కుమిలిపోయే వాడో… ఏది ఏమైనా ఇవాళ గాంధి గారి పుట్టినరోజు… అందరం ఆయనకు హ్యాపీ బర్త్ డే… చెప్పేద్దాం…. మనం చేస్తున్న నిర్వాకాల సాక్షిగా ఆయన గుండె కేకు ను కట్ చేసి ఆయన మనసులో వున్న ఆశాజ్యోతి క్యాండిల్ ను ఆర్పేద్దాం… ఆ తరువాత అందరం గంగ్నం డాన్సు చేసుకుంటూ ” రఘుపతి రాఘవ రాజారాం ” పాట పాడేసుకుందాం….!!

                                                                                             – ఏవీయస్ (దర్శకుడు, నటుడు)