దేశంలో కరోనా ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్ను నియంత్రించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. లాక్ డౌన్ కేంద్రం మరో 19 రోజులు పొడిగించడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు.
రెండో విడత లాక్ డౌన్ హేతుబద్ధత, విధివిధానాలపై అదేపనిగా చర్చించడంలో అర్థంలేదని అభిప్రాయపడ్డారు. అయితే, మే 3 వరకు మనం ఎంచుకున్న మార్గంలోనే నిలిచినా అనుకున్న ఫలితాలు రాకపోతే ఏంచేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ పొడిగింపు సత్ఫలితాలు ఇవ్వని పక్షంలో కేంద్రం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదైనా ఉందా? లేక ఇదే సరైన విధానం అంటారా? అని ప్రశ్నించారు.