రోడ్ మ్యాప్ లతో నేతలు బిజిబిజీ.. !

road-maps-on-telanganaరాష్ట్ర ముఖ్యనేతలు రోడ్ మ్యాప్ లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇటీవల రాష్ట్ర పర్యటనలో భాగంగా.. తెలంగాణ, సమైక్యాంద్ర లకు సంబంధించి రాష్ట్ర నేతలు రోడ్ మ్యాప్ తో హస్తినాకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. డిగ్గీ ఆజ్ఞతో.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటి సీఎం దామోధర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో పాటుగా,  కేంద్ర మంత్రి చిరంజీవి కూడా మ్యాప్ ల  ప్రిపరేషన్ లో తలమునకలై ఉన్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తెలంగాణకు భారీ ప్యాకేజి అనే మ్యాప్ తో అధినేత్రిని కలవాలని రెడీగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి ప్యాకేజితో..  తెలంగాణా అభివృద్ధి దిశగా వ్యూహారచనలో ఉన్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం ప్రత్యేక తెలంగాణ విషయంలో రోడ్ మ్యాప్ పై చర్చించేందుకు రేపు తెలంగాణ నేతలతో సమావేశమవడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈయన గారి మ్యాప్ హైదరాబాద్ తో కూడిన తెలంగాణ  10 పది జిల్లాల చుట్టూనే తిరుగుతుందా లేదా.. రాయల సీమను మ్యాప్ లోనికి లాగుతాడా? అన్నది చూడాలి.

ఇక పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎప్పుడు ఏ వాదానికి వాలుతాడో.. ఆయనకే తెలీదు. తాజాగా, రోడుమ్యాప్ పై  బొత్స ఈరోజు కేంద్రమంత్రులు, సహాయ మంత్రులు, పార్టీ ఎంపీలతో సమావేశమయి చర్చించారు. అయితే, బొత్సతో భేటీ అయిన వారిలో దాదాపుగా అందరూ సీమాంధ్ర నేతలే ఉండటం వలన ఆయన గ్రాపు కాస్త సమైక్యాంధ్ర వైపు మళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి అలవాటుగా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రా రెండూ వైపుల మ్యాప్ వెళ్లిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి నుంచి  మ్యాప్ ను ఆశించడం కూడా ఎక్కువేనేమో.. ప్రజలు నమ్మి కాస్త పట్టం  కట్టిన సమాజిక న్యాయానికే సమాధి కట్టి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. అయిననూ.. అధిష్టానం ఆదేశం కాబట్టి ఏదో ఒకటి ఇచ్చి చేతులు దులుపుకోవడం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వీరితో పాటు.. సీనియర్లమని సీరియస్ గా చెప్పుకునే చాలా మంది నాయకులు కూడా తమ తమ రోడ్ మ్యాప్ లతో రెడీ అవుతున్నారు. డిగ్గీ ఒక మారు రాష్ట్ర పర్యటనకు వస్తేనే.. ఇంతమంది నాయకులు రోడ్ మ్యాప్ లు గీయాల్సివస్తే.. భవిష్యత్ లో ఆయన ఇంకేన్ని మ్యాప్ లు గీయిస్తారో.. !

మరిన్ని రోడ్ మ్యాప్ లను గీసి ఏం లాభంలే..  ఆల్ రెడీ అమ్మ ఏదో ఓ గ్రాప్ గీసింటుందిలే అనుకునే నాయకులూ.. ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.