Site icon TeluguMirchi.com

ఎందుకోసమీ లేఖాస్త్రాలు?

lagadapatiరాజకీయ నాయకులంటేనే ఊసరవెళ్లిలా రంగులు మార్చాలా? అసలు రంగు బయటపడకుండా చూసుకోవడమే రాజకీయమా? కొందరు రాజకీయ నాయకులను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్ ను ఆమోదించిన తరువాత రాజీనామాలు చేసినట్లు ప్రజలను నమ్మించి ప్రగల్బాలు పలికిన కేంద్ర మంత్రులకు ఏమైందో తెలియదుగానీ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. సీమాంధ్ర ప్రజల్లో చెలరేగిన ఆగ్రహ జ్వాలల్ని చల్లార్చేందుకు మొదట రాజీనామా డ్రామాలు ఆడిన వీరంతా ఇప్పడు కొత్త నాటకానికి తెరతీసినట్లు కనిపిస్తోంది. ప్రజలపక్షాన ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడే వారే నాయకుడు. అయితే సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రం హస్తినలో సమావేశమై తామేదో చేస్తున్నట్లుగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణ ఏర్పాటును అడ్డుకుని తీరతామన్న లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేసే విషయాన్ని పక్కన బెట్టి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపాలని ప్రధానికి లేఖ రాసారు. ఎంత విడ్డూరం… అసలు ప్రధాని అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాతేకదా తెలంగాణ ప్రక్రియ వేగవంతమైంది. అయినా రాజీనామాస్త్రాలతో కానిది లేఖల ద్వారా ఏం జరుగుతుంది అని సందేహిస్తున్నారు జనం. అయినా అమ్మగారు చెబితే గానీ ఏ పని చేయని అయ్యగారు ప్రధాని అని ప్రతిపక్షాలు ఓ వైపు విమర్శిస్తుంటే… సోనియాకు లేఖ రాస్తే కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుంది కానీ, ప్రధానికి లేఖ రాయడం వల్ల ఏం లాభం అని గుసగుసలాడుకుంటున్నారు తెలిసినవారంతా… ఇంత చిన్న విషయం కూడా లగడపాటి గారికి తెలియదా? లేక తెలిసికూడా ఇలా ……. అయినా మనకెందుకులెండి.

Exit mobile version