కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఏపీ మంత్రి

మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున కూకట్‌పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసిని పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. సుహాసినికి మద్దతుగా ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లిలో సుహాసినితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. నందమూరి బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించాలని కూకట్‌పల్లి ప్రజలను కోరారు. నందమూరి కుటుంబానికి తన కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని పరిటాల సునీత పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పరిటాల సునీత అన్నారు. కుకట్‌పల్లి తెదేపాకు కంచుకోట అని.. ఆమె గెలుపు కోసం అందరూ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. మరోపక్క తెలంగాణ ఎన్నికల్లో ఏపీ మంత్రి పాల్గొనడంపై చర్చనీయంశంగా మారింది. ఏపీ మంత్రి ప్రచారంతో టీ టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందని టీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఏపీ నుంచి స్థిరపడిన వారు ఉండటంతో సునీత ప్రచారం తమకు కలిసి వస్తుందని తెలంగాణ టీడీపీ వర్గాలు వాదిస్తున్నాయి.