‘కరోనా’ కట్టడికి పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్లో ఒకటి సామాజిక దూరం పాటించడం. ఈ విషయాన్ని ప్రభుత్వం, అధికారులు ప్రజలకు తరచుగా చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ నిబంధనను పెడచెవిన పెద్దలూ లేకపోలేదు.
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్ చేశారు. ఓ దుకాణానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు అక్కడ గీసిన బాక్సుల్లో నిల్చున్నారు. లోకం తెలియని వీరు కూడా సామాజిక దూరం పాటించడంతో ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
దీన్ని కేటీఆర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ వారంలో నాకు ఎంతో నచ్చిన ఫొటో ఇది. ఈ ముద్దులొలికే చిన్నారులు పెద్దలకు సామాజిక దూరం గురించి నేర్పిస్తున్నారు’ అంటూ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని ట్వీట్ చేశారు కేటీఆర్.