విగ్రహాలపై వింత రాజకీయాలు!!

ktr-comments-on-tank-bund-sకేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌ పై ఉన్న సీమాంధ్రుల విగ్రహాలను తొలగించి, అక్కడ తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కరీంనగర్ లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, బందగి, శ్రీకాంతాచారి విగ్రహాలను నెలకొల్పుతామని ఆయన తెలిపారు. తెలంగాణ పోరాటయోధుల చరిత్రను పాఠ్యాపుస్తకాల్లో చేర్చే విధంగా కృషి చేస్తామన్నారు కేటీఆర్ అన్నారు. సీమాంధ్ర పాలకులు కుట్రపూరితంగా తెలంగాణ మహనీయుల చరిత్రను వక్రీకరించారని ఆయన ఆరోపించారు.

ట్యాంక్ బండ్ పై కొత్తగా తెలంగాణ అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అంటే ఎవరికి అభ్యంతరం వుండేది కాదేమో. కానీ, ఇప్పుడున్న సీమాంధ్ర మహానీయుల విగ్రహాలను తొలగించి వాటి స్థానంలో తెలంగాణ పోరాట వీరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై టీ-నేతలు సైతం ఫైర్ అవుతున్నారు. మహానీయుల విగ్రహాలపై వింత రాజకీయాలు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, గతంలో.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో.. ఉద్యమకారులు ట్యాంక్ బండ్ పై విగ్రహాలను ధ్వసం చేసిన విషయం తెలిసిందే.