వీధి కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి.. స్పందించిన అధికారులు


హైదరాబాద్‌‌ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై జీహెచ్‌ఎంసీ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో వీధి కుక్కల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇక జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందనడం సరికాదని తెలిపారు. 30 సర్కిళ్లలో కుక్కలను పట్టుకునేందుకు 30 బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. అంబర్‌పేట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్‌ఎంసీ తరుఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడంపై సమావేశంలో సలహా వచ్చిందని వివరించారు. ఒక్కో వార్డులో 20 కుక్కలను దత్తత తీసుకోవడానికి దృష్టిని సారిస్తున్నామని, నెలకు ఆరు వందల కుక్కలను దత్తత తీసుకుని వాటికి ఆహారం అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా కుక్కలకు స్టెరిలైజేషన్‌ పూర్తి చేశామని వెల్లడించారు. స్టెరిలైజేషన్‌ తర్వాత యాంటీ రాబిస్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నామని మేయర్‌ వెల్లడించారు. వీధి కుక్కల కట్టడికి ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో వెటర్నరీశాఖ, జోనల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఈ ఘటనపై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీధికుక్కల బెడద నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రతీ మున్సిపాలిటీలోనూ వీధి కుక్కల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాల‌ను, జంతు జ‌న‌న నియంత్రణ కేంద్రాల‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుక్కల స్టెరిలైజేష‌న్ కోసం చర్యలు చేప‌ట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.

ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన జ‌రిగిన ఘ‌ట‌న‌లో ప్ర‌దీప్‌ అనే నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలానికి చెందిన గంగాధర్ తన కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఛే నంబర్ ఛౌరస్తాలో కారు సర్వీసింగ్ సెంటర్‌లో పని చేస్తున్న అత‌ను ఆదివారం తన ఇద్దరు పిల్లలను సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. గంగాధర్ పనిలో నిమగ్నమవ్వగా నాలుగేళ్ల ప్రదీప్ ఆడుకునేందుకు వీధిలోకి వెళ్లాడు. దీంతో అక్కడున్న వీధి కుక్కలు బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా, కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.