Site icon TeluguMirchi.com

కొరివి పట్టుకున్న కాంగ్రెస్

diggiకోరి కొరివి చేతపట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే దాంతో తన కొంప కాల్చుకోవాలి. కానీ అలా చేసేంత వెర్రిది కాదా పార్టీ. ఇక మరి ఎవర్ని తగలబెట్టాలి. అనామకంగా దొరికింది కదా..ఆంధ్రప్రదేశ్..దానికే అంటించాలి కొరివి. మన నాయకులకు చావ చచ్చింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించలేరు. ఎందుకిలా విభజించు పాలించు అన్న రీతిలో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని అడగలేరు. పొరుగ పచ్చ ఓర్చని చిదంబరాలు, మొయిలీలు రగిల్చిన తెలంగాణా చిచ్చులో ఇప్పుడు మాండ్వా మహరాజు దిగ్విజయ్ సింగ్ మరింత ఆజ్యం పోస్తున్నారు. ఇచ్చేస్తామని ఓసారి..ఎప్పుడు చెప్పామని మరోసారి, ఇలా చిత్తచాంచల్యం చెందిన వారిలా పూటకోమాట మాట్లాడుతూ, మన రాష్ర్టంతో, మన నాయకులతో, మన ఉద్యమాలతో వారి చిత్తానికి ఆడుకుంటున్నారు. నిజానికి ఈ నాటకాలు కనిపెట్టిన నాయకులైతే, నిజంగా రాష్ర్ట అభివృద్ధి కోరుకునేవారైతే, తమ తమ స్వప్రయోజనాలు పక్కన పెట్టి, ఉద్యమాలకు స్వస్తి చెప్పి, వారి ఆట కట్టించాలి. కానీ స్వార్థ ప్రయోజనాలే పరమావథి అయిన నేతలు అలా చేసే పరిస్థతి లేదు. పులిస్వారి ప్రారంభించిన ఉద్యమనేతలు దాన్ని ఆపలేరు. పంతాలకు, పరువుకు పోయిన నేతలు దాన్ని అడ్డకోవడం ఆపరు. ఇక అభివృద్ధి అటకెక్కి, రాష్ట్రం చిరిగిన విస్తరి అవుతుంటే, మేల్కొనాల్సింది ప్రజలు మాత్రమే. వారు వాస్తవం గ్రహించిన రోజున కాంగ్రెస్ చేతిలో కొరివి, దానికి తల గోక్కోడానికి మాత్రమే పనికివస్తుంది.

Exit mobile version