‘సురేఖ’.. రేఖ దాటనుందా..?

konda-surekhaవైకాపా నేత, మాజీ మంత్రి కొండా సురేఖ ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు.  వైకాపా కు చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోసమంటూ..  రాజీనామా చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన కొండా సురేఖ, ఇతర తెలంగాణ నేతలు మహేంధర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, ప్రసాద్.. తదితరులు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో ఈరోజు సమావేశమయ్యారు. దాదాపు అరగంటపైగా ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం సురేఖ విలేకరులతో మాట్లాడుతూ.. అసంతృప్తితోనే సమావేశం నుండి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. విజయమ్మ ఇచ్చిన వివరణ లో పార్టీ వైఖరికి, ఎమ్మెల్యేల వైఖరికి మద్య ఉన్న తేడాపై స్పష్టత ఇవ్వలేకపోయారని సురేఖ వ్యాఖ్యానించారు. త్వరలోనే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆమె అన్నారు. తెలంగాణ నేతల అసంతృప్తితి వైకాపా కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తున్న తరుణంలో.. తాజాగా  ఉన్న కొద్దిమంది తెలంగాణ నేతలు కూడా అసంతృప్తితో.. భవిష్యత్ కార్యాచరణలో ముగిపోవడంతో వైకాపా తీవ్ర ఆందోళనకు గురైనట్లు కనబడుతోంది. కాగా, కొండా దంపతులు వైకాపాకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.