కేటీఆర్ ని ఉతికారేసిన కొండా సురేఖ


తెరాసలో టికెట్‌ దక్కని నేతలు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ శనివారం మీడియాతో మాట్లాడుతూ తనకు సీటు ఇవ్వకపోవడం మహిళలందరినీ అవమానించడమే అని విమర్శించారు. ఇప్పటివరకు టీఆర్ఎస్‌ నుంచి తాము ఎలాంటి లబ్ది పొందలేదని, పార్టీ అభివృద్ధి కోసమే పనిచేశామని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేర్కొన్నారు.

వరంగల్‌ జిల్లాలో కీలక నేత అయిన కొండాసురేఖ టికెట్‌ను కేసీఆర్‌ పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. జాబితాలో తన పేరును ప్రకటించకపోవడం చాలా బాధ కల్గించిందని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ మహిళలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ గుర్తుపైనే గెలిచిన తాము చేదు అయ్యామని… కానీ టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎందుకు తీపి అయ్యారని ఆమె టీఆరెస్ అధిష్టానాన్ని నిలదీశారు.

కేసీఆర్‌ మాట విని పరకాలను వదులుకుని వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి వచ్చాను. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో 50 వేల మెజార్టీ సాధించిన నాకు టికెట్‌ ఎందుకు ఇవ్వలేదు. నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేసినా ఏ రోజూ నేను మాట్లాడలేదు. గత నాలుగేళ్లుగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశా. ఈ నాలుగేళ్లలో నేను చేసిన తప్పేంటో చెప్పాలి’.

‘ఏ ఎన్నికలు జరిగినా నేను పార్టీ నుంచి నయాపైసా డబ్బు తీసుకోలేదు. ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నిక సమయంలోనూ మేమే మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం. కార్పొరేషన్‌ ఎన్నికలకూ మేమే ఖర్చు చేశాం. మధుసూదనాచారికి భూపాలపల్లి ఇవ్వకపోతే తమకు ఇవ్వాలని కోరామన్నారు. తాము రెండు సీట్లు అడిగామనడం అబద్ధమని..పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టేందుకే మాకు టికెట్‌ ఇవ్వలేదు. మా ఫోన్లు, మా డ్రైవర్ల ఫోన్లు కూడా ట్రాప్‌ చేశారు.

నాకు టికెట్‌ ఇవ్వకపోవడానికి కారణాలెంటో చెప్పాలి. టికెట్‌ ఇచ్చిన అభ్యర్థులపై చేసిన సర్వే నివేదిక ప్రజల ముందు ఉంచాలి. తెలంగాణ అనేది కల్వకుంట్ల వారి ఇల్లు కాదు. అవసరమైతే నేను, మా ఆయన, మా కుమార్తె ముగ్గురం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం.

తనకు టికెట్ ఇవ్వకపోవడానిక కేటీఆరే కారణమని, తమని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్నదీ కేటీఆరే అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో కేటీఆర్ కోటరీని తయారు చేసుకుంటున్నారని, తెలంగాణను ఆగం పట్టించేందుకు ఒక టీమ్‌ను తయారు చేస్తున్నారని విమర్శించారు. మేం తెరాసలోకి రావడం హరీశ్‌రావుకు ఇష్టం లేదు. అయినా ఆయన మాకు అండగా నిలిచారు అని కొండా సురేఖ అన్నారు.