నిజానికి మొన్నటి దాకా ఘంటా అనకాపల్లిని వీడి, పెందుర్తికి వలస వెళ్తారన్న వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడాయన అనకాపల్లి తనది అన్నది సాకుగా చూపి, కొణతాలను పార్లమెంటుకు పంపాలనుకుంటున్నారు. కానీ కొణతాలకు అది పెద్దగా రుచించడం లేదు. అదీ కాక కాంగ్రెస్ లేదా వైకాపా అధికారంలోకి వస్తే తన అనుభవంతో మంత్రి కావచ్చన్నది ఆయన ఆలోచన. కానీ ఘంటా, బొత్స ఆలోచన వేరుగా వుంది. అందుకే కొణతాల ఎలాగైనా జగన్ దగ్గర నుంచి గట్టి హామీ సంపాదించి, పార్టీలోనే వుండాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ సంగతి తెలిసే, ఘంటా కూడా ఆచితూచి ప్రకటనలు చేస్తున్నారు.
తన బలప్రదర్ళనతో జగన్ ను కట్టడి చేయాలన్నది కొణతాల ఆలోచనగా కనిపిస్తోంది. అదే సమయంలో తన బలాన్ని చూపి కాంగ్రెస్ ను కూడా తనకు కావాల్సిందానికి ఒప్పించాలన్న ఐడియా కూడా వున్నట్లుంది. తెలుగుదేశం పార్టీ ఆలోచన ఇందుకు భిన్నంగా వుంది. కొణతాలను పార్టీలోకి ఆహ్వానించి, వైకాపా దాడితో తెచ్చుకున్న చిక్కులు తెచ్చుకునే ఆలోచన చేయడం లేదు. పరిస్థితులను గమనించడమే ఆ పార్టీ ప్రస్తుతం చేస్తున్న పని. నిజానికి కొణతాల నేరుగా కాంగ్రెస్ లోకి వెళ్ల దల్చుకుంటే, వెళ్లిపోవచ్చు. దానికి ఈ బలప్రదర్ళన హడావుడి అక్కరలేదు.
ఇక్కడ కొణతాలది మరో వ్యూహం కూడా వుంది. దాడి వీరభద్రరావు వైకాపాలో చేరిన తరువాత తొలిసారి అనకాపల్లి వస్తున్న సందర్భంగా భారీ బల ప్రదర్శన చేయబోతున్నారు. కొణతాల బలగం అంతా అక్కడే వుంటే, పార్టీ ఆదేశాల మేరకు దాడికి స్వాగతం పలకాలి. అది కొణతాలకు ఇష్టం లేదు. ఏదో ఒంకన తన బలగాన్ని రాజధానికి రప్పిస్తే రెండు పనులు నెరవేరుతాయన్నది ఆయన ఆలోచన. అయితే ఇక్కడ ఓ సమస్య వుంది. కొణతాలను కాంగ్రెస్ పార్లమెంట్ టిక్కట్ ఇవ్వదల్చుకుందన్నది పసిగట్టిన జగన్, మొండిగా కూర్చుని, మెట్టుదిగిరాకుంటే, పరిస్థితి ఎదురుతిరుగుతుంది. కొణతాలకు మరో మార్గం వుండదు. జగన్ కు తలవంచడం లేదా, కాంగ్రెస్ లో చేరి పార్లమెంటుకు వెళ్లడం. అందుకే అంటారు రాజకీయాల్లో తెలివితేటలు,విశ్వాసం ఒక్కటే చాలవు..అదృష్టం కూడా కలసిరావాలని.