శాంతిభద్రతల దృష్ట్యా సమైక్యంగా వుంచాలి : సీఎం

cm-kiranరాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కిరణ్ సమైక్యవాదాన్ని మంత్రుల బృందం ముందు వినిపించారు. అనంతరం కిరణ్ ఢిల్లీలోని ఏపీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ.. జీవోఎం అన్ని వివరాలతో కూడిన రెండు పుస్తాకాలను అందజేశానని తెలిపారు. విభజన వల్ల రెండు ప్రాంతాలకు నష్టమేనని జీవోఎం కు వివరించినట్లు సీఎం పేర్కొన్నారు. ఒక సమస్యను పరిష్కబోయి…. మరో పెద్ద సమస్యను సృష్టించడం మంచిది కాదని మంత్రుల బృందానికి సూచించానని కిరణ్ తెలిపారు. శాంతిభద్రల సమస్యను అయినా దృష్టిలో వుంచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరారని ఆయన అన్నారు.

ఆది నుంచి సమైక్యరాగాన్ని వినిపిస్తున్న ముఖ్యమంత్రి ఈసారి కూడా విభజన వల్ల తలెత్తి సమస్యలను దేశ రాజధానిలో ఏకరువుపెట్టారు. విద్యా – ఉద్యోగాలు, జలవనరులు, రాజధాని, నక్సలైట్లు, విద్యుత్ సమస్యలు, ఆర్టికల్ 371(ఢీ) ఇలా.. ప్రతి సమస్యను ప్రస్తావిస్తూ.. విభజన మంచిది కాదనే చెప్పే ప్రయత్నం చేశారు. కిరణ్ మరోసారి ధిక్కార స్వరాన్న గట్టిగా వినిపిస్తూనే.. నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలని సూచించారు.

విభజన వల్ల మతతత్వం, నక్సలిజం పేట్రేగే అవకాశాలున్నాయని, నక్సలైట్ నాయకుల్లో 80 శాతం మంది అగ్రనాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారేనని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలలో నక్సలిజం సమస్య భారీగా పెరుగుతుందని కిరణ్ అన్నారు. నక్సలిజం దేశానికి అతిపెద్ద సమస్య అని.. దీన్ని పలుమార్లు ప్రధాని కూడా చెప్పినట్లు గుర్తు చేశారు. ఇది జాతీయ భద్రతకు కూడా ముప్పుతెస్తుందని తెలిపారు.

రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఉద్యోగుల సినియార్టీని కోల్పోవలసి వస్తుందని చెప్పుకొచ్చారు. వరదలు లాంటి విపత్తులు సంభవించినప్పుడు స్పందించడం కూడా కష్టసాధ్యమవుతుందని సీఎం అన్నారు. విభజన జరిగితే.. ఎక్కువగా నష్టపోయేది తెలంగాణ ప్రాంతమేనని కిరణ్ మరోసారి గుర్తు చేశారు. తెలంగాణకు తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడుతుందని అన్నారు. 50 తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగంలో కేవలం 50 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోందని… మిగతా 50 శాతం సీమాంధ్ర ప్రాంతం నుంచి వస్తోందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో 175 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుందని… దీనికోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఇక హైదరాబాద్ రాజధాని కావడం వల్ల పరిశ్రమలు, విద్యావ్యవస్థలు అన్ని ఇక్కడే కేంద్రికృతమయ్యాయని.. విభజన జరిగినట్లయితే.. సీమాంధ్ర ప్రాంతంలోని విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. ఇలా.. ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధిష్టానం నిర్ణయాన్ని మరోసారి పున:సమీక్షించుకోవాలని సూచించారు. కిరణ్ గతంలో చెప్పిన చాలా విషయాలనే మరోసారి ప్రస్తావించారు.

విభజన అంశం తుది అంకానికి చేరుకున్న దశలో.. ముఖ్యమంత్రి చేసిన సూచనలు అధిష్టానం ఎంత వరకు పరిగణలోనికి తీసుకుంటుంది అన్నది ప్రశ్నార్థకమే.