రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య చివరికి విషాదాంతమైంది. అయితే ఈ కేసులో నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. సైఫ్ ఫోన్ లో 17 వాట్సాప్ చాట్స్ పరిశీలించిన పోలీసులు, యాంటీ ర్యాగింగ్ కమిటీ పలు కీలక విషయాలను గుర్తించారు. అనుషా, భార్గవి, LDD+ knockouts వాట్స్ అప్ గ్రూప్ చాట్స్ వివరాలు సేకరించి పరిశీలించారు. అందులో అనస్తీషియా డిపార్ట్మెంట్ లో ప్రీతిని సూపర్వైజ్ చేస్తున్న సీనియర్ డాక్టర్ గా సైఫ్ ఉన్నాడు. అయితే రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై సీనియర్ సైఫ్ కోపం పెంచుకున్నాడు.
డిసెంబర్ లో ఒక యాక్సిడెట్ కేస్ విషయం లో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ఆ ప్రమాదానికి సంబంధించి ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్టును మెడికో ప్రీతి రాసింది. అయితే ప్రీతి రాసిన రిపోర్టును తమ వాట్సాప్ గ్రూప్ లో పెట్టి హేళన చేశాడు సైఫ్. రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ప్రీతిని అవమానించాడు సైఫ్. దీంతో.. తనతో ఏమైనా ప్రాబ్లమా అంటూ సైఫ్ ను ప్రశ్నించింది ప్రీతి. అంతేకాదు తనతో ఏమైనా సమస్య ఉంటే హెచ్ఓడీ (HOD) కి చెప్పాలని సైఫ్ కు ప్రీతి సూచించింది. దీంతో ప్రీతిపై మరింత పగ పెంచుకున్న సైఫ్.. ప్రీతిని వేదించాలని తన స్నేహితుడు భార్గవ్ కు చెప్పాడు. RICU లో రెస్ట్ లేకుండా ప్రీతికి వరుస డ్యూటీ వేయాలని సూచించాడు సైఫ్. దీంతో ప్రీతి సీనియర్ సైఫ్ పై గత నెల 21వ తేదీన హెచ్ఓడీ నాగార్జునకు ఫిర్యాదు చేసింది. ప్రీతి ఫిర్యాదుపై స్పందించిన డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతికి, సీనియర్ సైఫ్ కు కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ ఆ మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఐదు రోజులపాటు ప్రాణాలతో పోరాడిన ప్రీతి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసింది.