భారీ వర్షాలు కేరళలో విధ్వంసం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి 26మంది మరణించారు. కేరళలో తాజా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కేరళకు అన్నివిధాలా అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సైన్యం,జాతీయ విపత్తు స్పందన దళం..ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు,అగ్నిమాపక దళం సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొట్టాయంలోని కూటికల్, ఇడుక్కిలోని కొక్కాయర్‌లలో ప్రజలకు ఆహార పొట్లాలు, నిత్యావసర సరకులు అందించేందుకు నౌకాదళ హెలికాప్టర్ ను రంగంలోకి దించారు. పథనంతిట్టలోని పలు ప్రాంతాల్లో నీటిలో చిక్కుకున్న 80 మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి.