ప్రమాణస్వీకారానికి మెట్రో లో వెళ్తా : కేజ్రీవాల్

kejriవి.ఐ.పి సంస్కృతి కి స్వస్తి పలకడం ఆమ్ ఆద్మీ అజండా లో ఒకటి. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అప్పుడే మొదలెట్టారు. రేపు దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనదైన ప్రత్యేకత కనబరుస్తున్నారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను వరసగా నిరాకరిస్తు వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే భద్రత తనకు అక్కర్లేదని చెప్పిన కేజ్రీవాల్, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రికోసం ప్రభుత్వం ఇచ్చే బంగ్లా సదుపాయాన్ని సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడో మరో ప్రకటన తో ఆకట్టుకున్నారు.
రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి తనతో పాటు మొత్తం ఎమ్మెల్యేలందరూ మెట్రో రైల్లోనే వస్తారని తెలిపారు. ఈ రోజు తన నివాసంలో నిర్వహించిన జనతా దర్బార్ లో ఆయన ఈ విషయం చెప్పారు. ప్రమాణస్వీకారం దగ్గర పడుతోంది.. మీకు ఎలాంటి ఒత్తిడి లేదా ? అన్న ప్రశ్నకు బదులు చెబుతూ .. ‘నాపై పెద్ద బాద్యత ఉందన్న సంగతి మీ అందరికి తెలుసు. అయితే కలసికట్టుగా చేస్తే ప్రపంచాన్ని మార్చగల శక్తీ వస్తుందని’ సమాదానం ఇచ్చారు.