బ్రేకింగ్ : ఆత్మహత్య చేసుకున్న కీసర ఎమ్మార్వో నాగరాజు..

అవినీతి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో ఉన్న నాగరాజు.. జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ల్యాండ్ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు పట్టుబడ్డారు.

ఏసీబీ అధికారులకు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం లభించడంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. నెలరోజులుగా ఈ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.