సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. అదేవిధంగా నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. ‘‘విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బందిపై ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని క్షమించేది లేదు.. వారు సమాజానికి భారం. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. వారం రోజులుగా కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి(57) మరణించగా, అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి కుటుం సభ్యులు కోపోద్రిక్తులై వైద్యులతోపాటు సిబ్బందిపై దాడికి దిగడం కలకలానికి కారణమైంది.