కేసీఆర్…. ఇప్పుడు కాసేపు బ్రేక్

kcr-trsతెలంగాణ అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం చర్చల మీద చర్చలు జరుపుతూవుండగా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ తన ఫాం హౌస్ లో రెస్ట్ తీసుకుంటూ, అక్కడి నుంచే ఆయన ఢిల్లీ పరిణామాలను పరిశీలిస్తున్నారని సమాచారం. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం తరువాత కేసీఆర్ మళ్లీ సైలెంట్ అయ్యారు. అంతకుముందు జేఏసీ నేతలతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన కేసీఆర్… అప్పటి నుంచే ఫామ్ హౌస్ కు స్విప్ట్ అయ్యారు. ఈ నెల 2న హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో జరిగిన ప్రొ. జయశంకర్ విగ్రహావిష్కరణ సభకు, ఆ తరువాత జరిగిన టీజీవో డైరీ అవిష్కరణకు కేసీఆర్ హాజరుకాలేదు. ఆయన రాకపోవడంపై ఉద్యోగ సంఘాల నేతల అసహనం వ్యక్తం చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రొ. జయశంకర్ ను మార్గదర్శిగా చెప్పుకునే కేసీఆర్… విగ్రహావిష్కరణకు ఎందుకు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. మరి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు ఆయన వర్గాలు తెలుపుతున్నాయి.