రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైతు పక్షపాతి సీఎం శ్రీ కేసీఆర్ గారు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు మొత్తం రుణమాఫీ కి సంబంధించి రూ.18,241 కోట్లకు ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) విడుదల చేసింది.
ఇక మొదటి విడత లో భాగంగా రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్య ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఆర్థికశాఖ గురువారం రూ.237.85 కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 62,758 మంది రైతులకు లబ్దిచేకూరనుంది. బీఆర్ఎస్ అంటే భారత రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితం అయ్యింది అని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు.
కాగా, రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని కేసీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు.