పవన్‌ మనోడే.. కేసీఆర్‌ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటో?

కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ పథకంను ప్రవేశ పెట్టినందుకు అభినందించేందుకు నిన్న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను పవన్‌ కళ్యాణ్‌ కలిసిన విషయం తెల్సిందే. దాదాపు గంటన్నర పాటు కేసీఆర్‌, పవన్‌ల మద్య భేటీ జరిగింది. అదే సమయంలో పవన్‌ను డిన్నర్‌ చేసి వెళ్లాల్సిందిగా కేసీఆర్‌ కోరడం, అందుకు పవన్‌ ఇప్పుడు వద్దు అంటూ వెళ్లి పోవడం జరిగింది.

డిన్నర్‌కు కూడా ఆహ్వానించాడు అంటే ఇద్దరి మద్య ఎంత సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయో, భేటీ ఎంత ఉల్లాసంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భేటీ జరిగిన తర్వాత పార్టీ కార్యకర్తలకు కేసీఆర్‌ సందేశం ఇస్తూ పవన్‌ ఇకపై మనవాడు, ఆయన్ను కాస్త చూసుకోండి అంటూ కార్యకర్తలకు చెప్పాడు. నిన్న మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ నాయకులు పవన్‌పై విమర్శలు చేసేవారు.

తాజాగా కేసీఆర్‌ మనోడే అంటూ చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇక విమర్శలు ఆపేయండి అంటూ కొందరు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్‌, పవన్‌ల కలయిక కొత్త రాజకీయాలకు ఊతం అవ్వడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.