కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు ప్రీ పోల్ సర్వే చేపట్టాయి. ఓటరు నాడి కనిపెట్టేందుకు ప్రయత్నించాయి. సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టనున్నారని ఈ సర్వేలో తేలింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ తప్పదని చివరకు కాంగ్రెస్ ఆధిపత్యం సాధించనుందని సౌత్ ఫస్ట్ సర్వే తేల్చింది. ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పరిచే సీట్లు సాధించలేదని సర్వే తేల్చి చెప్పింది.
మార్చి 25 నుంచి ఏప్రిల్ 10 వరకు మధ్య గల తేదీల్లో సౌత్ ఫస్ట్ ఒపీనియల్ పోల్ చేపట్టింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలో ఏ పార్టీకి కూడా సగం మెజార్టీ మార్కు అయిన 113 సీట్లు గెలుచుకోలేవని సర్వే తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి అందరికంటే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించనుందని సౌత్ ఫస్ట్ సర్వే వెల్లడించింది.
ఇకపోతే మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఎన్నికల్లో కొత్తగా ఒక వెసులుబాటును కల్పించారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. అంతేకాదు రాష్ట్రంలో 100 ఏండ్లు పైబడిన ఓటర్లు సుమారు 17వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. దీంతో వందేండ్లు పైబడిన ఓటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటకే కావడం గమనార్హం.