మళ్లీ తెరవైకి వచ్చిన కాపుల రిజర్వేషన్ !

botsaకాపులను వెనుకబడిన తరగతులలో చేర్చాలన్న డిమాండ్ మళ్లీ మొదలైంది. దీనిపై కాపు,బలిజ,ఒంటరి తెగలకు చెందిన పలువురు హైదరాబాద్ లో ధర్నాచేసి, ఆ తర్వాత గాందీ భవన్ ను చుట్టుముట్టారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కాపు సంఘం నేతలు కలిశారు. 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేర్చుతామని హామి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ సందర్భంగా కాపు నేతలను ఉద్దేశించి పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఈ సమస్య చాలాకాలంగా పెండింగులో ఉందని,కేంద్ర మంత్రి చిరంజీవి కూడా దీనిపై కృషి చేస్తున్నారని అన్నారు.ఈ నెల 10 లోగా సీఎం, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామి ఇచ్చారు.

అయితే కాపులను బిసి లలో కలిపే ప్రతిపాదనను బిసి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇది వివాదాస్పద అంశంగా ఉండడంతో కాంగ్రెస్ ముందుకు వెళ్లలేకపోయింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇది ఇబ్బంది పెట్టె అంశమే. వచ్చే ఎన్నికలలో ఇది ప్రధాన అంశం అయ్యే అవకాశం వుంది.