కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా అడుగులు వేస్తున్న విషయం తెల్సిందే. కన్నడనాట ఉపేంద్రకు ఉన్న గుర్తింపు స్టార్డం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈయన రాజకీయంగా యూత్‌ను ఆకర్షించేందుకు సిద్దమవుతున్నట్లుగా అనిపిస్తుంది. కర్ణాటకలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందని అక్కడి రాజకీయ నాయకులు కొందరు చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యోగాల కోసం స్థానికులను తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రైవేట్ సంస్థలు అన్ని కూడా ఖచ్చితంగా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అంటూ కండీషన్ పెట్టిన విషయం తెల్సిందే. అలాగే కర్ణాటకలో కూడా అలాగే జరగాలంటూ ఉపేంద్ర డిమాండ్ చేస్తున్నాడు. ఈనెల 14 మరియు 15వ తారీకున ఉపేంద్ర స్థానికులకు ఉద్యోగాల విషయమై నిరాహార దీక్షకు దిగబోతున్నట్లుగా ప్రకటించాడు. స్థానికులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా బయటి నుండి తీసుకు రావడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆయన నిరాహార దీక్షను విరమించనున్నాడు. రెండు రోజుల నిరాహార దీక్షకు భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి.