Site icon TeluguMirchi.com

పదమూడు నెలల్లో కాకినాడ, శ్రీకాకుళం గ్యాస్ పైప్‌లైన్

kakinada-lng-terminal
ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది. రాష్ర్ట ఉజ్వల భవితకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిలో మరో మైలురాయి ఇది. కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టులో ఎల్ ఎన్ జీ టెర్మినల్ ఏర్పాటు కల త్వరలో సాకారం కానుంది. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ దిశగా రెండు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. ఏపీ గ్యాస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, గెయిల్, ఇంజిలు ఈ ఎంఓయూలు చేసుకున్నాయి. ఈ టెర్మినల్ లో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు 42 శాతం వాటా లభిస్తుంది. షెల్, ఇంజి, గెయిల్ కు 52 శాతం వాటా దక్కుతుంది. రోజువారీ 15 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను ఈ టెర్మినల్ హ్యాండ్లింగ్ చేస్తుంది.

మొదటి ఒప్పందం టెర్మినల్ ఎగ్రీమెంట్ కంపెనీ ఏపీజీడీసీ మధ్య, జీడీఎఫ్, సూయిజ్, షెల్ మధ్య కుదిరింది. టెర్మినల్ అభివృద్ధి, నిర్వహణను ఈ కంపెనీలు చూడాల్సి వుంది.

రెండో ఎంఓయూ గెయిల్, జీడీఎఫ్, సూయిజ్,షెల్ కంపెనీల మధ్య కుదిరింది. దీని ప్రకారం ఈ కంపెనీలు రీగ్యాసిఫైడ్ మార్కెటింగ్ వ్యవహారాలను చూడాల్సి వుంటుంది.

ఏడాదికి 5 మిలియన్ టన్నుల కెపాసిటీతో నిర్వహిస్తారు. అత్యధిక డిమాండ్ వున్న సమయంలో రెట్టింపు సామర్ధ్యంతో ఈ టెర్మినల్ పనిచేస్తుంది.
పబ్లిక్,ప్రైవేటు భాగస్వామ్యంలో దేశంలో నిర్మితమవుతున్న అత్యంత భారీ ప్రాజెక్టుగా కాకినాడ ఎల్ఎన్‌జి టెర్మినల్ రికార్డు సృష్టించనున్నది.హోప్ ఐలెండ్, బ్రేక్ వాటర్ తదితర ప్రకృతి సిద్ధ అనుకూలాంశాలతో కాకినాడలో ఎల్.ఎన్.జి టెర్మినల్ కల సాకారం కానున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ టెర్మినల్ 18 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు.తాను ఈ ప్రాజెక్టుకు బెస్టు మార్కెటింగ్ మేనేజర్ గా వుంటానని ముఖ్యమంత్రి అన్నారు. రూ. 1800 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ టెర్మినల్ తూర్పు తీరంలో తొలిసారిగా సముద్రంలో తేలియాడే టెర్మినల్ అవుతుందని చెప్పారు. వచ్చే 13 నెలల్లో కాకినాడ నుంచి శ్రీకాకుళానికి గ్యాస్ పైప్‌లైన్ నిర్మిస్తామని వివరించారు. 19 వశతాబ్దంలో బొగ్గు నిల్వలే ఇంధన రంగంలో కీలకపాత్ర వహించగా, 20 శతాబ్దం చమురుదేనన్నారు. 21 శతాబ్దపు ఇంధన రంగాన్ని గ్యాస్, సహజవాయు ఇంధనాలు భర్తీ చేశాయన్నారు. ఒప్పందంపై సంతకం చేసిన అంతర్జాతీయ, జాతీయ భాగస్వాములకు మంచి అనుభవం వుందని, వీరు అత్యుత్తమ నైపుణ్యంతో నిర్ణీత 18 నెలల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గ్యాస్ గ్రిడ్ కు ఈ ప్రాజెక్టు వల్ల నిరంతరం సహజవాయువు లభ్యమవుతుందని చెప్పారు. ఇంధన సరఫరాకు ఒక భరోసా అని, కాలుష్యాన్ని బాగా తగ్గించటానికి ఈ టెర్మినల్ తోడ్పడుతుందన్నారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న తన కలను నిజం చేయటంలో ఈ టెర్మినల్ ఎంతో సహాయకారిగా వుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి తోడ్పడతామని గెయిల్ సీఎండీ బి.సి త్రిపాఠీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్యాస్ హబ్ (సహజవాయు కేంద్రం) గా తీర్చిదిద్దటంలో ఇది తొలి అడుగు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ చెప్పారు. కేజీ బేసిన్-6 లో చమురు, సహజవాయువుల నిక్షేపాలు అపారంగా వున్నాయన్నారు. రాష్ట్ట్రంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కాకినాడ ఎల్.ఎన్.జి టెర్మినల్ ఒక వూపునిస్తుందని చెప్పారు. ఎంఓయూలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గెయిల్ సీఎండీ బి.సి త్రిపాఠీ, జిడిఎఫ్ సూయిజ్ సీఈఓ ఫిలిప్ ఆలివర్, షెల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ అనింద్య చౌదరి సమక్షంలో కుదిరాయి. సమావేశంలో ఉపముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, వైద్య ఆరోగ్య శాఖమంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version