అన్నపూర్ణ స్టూడియో కి భూములివ్వడం తప్పు: కె.కె

K-Keshava-Raoహీరో నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ అంశం పై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు ఆదివారం ఘాటుగా స్పందించారు. అన్నపూర్ణ స్టూడియోకి భూమి ఇవ్వడం ఓ నాన్సెన్స్ అని మండిపడ్డారు. అన్నపూర్ణ స్టూడియోకు భూములివ్వడం తప్పని గతంలోనే తాను చెప్పానని అన్నారు. మరోవైపు దేశంలో 90 శాతం అవివేకులే అన్న జస్టిస్‌ కట్జూ వ్యాఖ్యల పై కూడ మండి పడ్డారు. దేశంలో 90శాతం అవివేకులే అన్న జస్టిస్‌ కట్జూ కూడా ఆ జాబితాలోనే ఉంటారని కేశవరావు కట్జూ వ్యాఖ్యల ను తిప్పికొట్టారు. చిన్న రాష్ట్రాలు మంచివి కావన్న ఆయన మాటలను పట్టించుకోవద్దన్నారు. ఎస్ఆర్ సి గతంలో సిఫారసు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్న వాస్తవాన్ని మేధావులు గ్రహించాలన్నారు. ఇక రేణుకాచౌదరి తెలంగాణ అమరవీరులపై చేసిన వ్యాఖ్యలపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కె కె హెచ్చరించారు. పరిస్థితులను అర్థం
చేసుకుని రేణుకాచౌదరి వ్యహరించాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్‌ను ప్రజలకు దూరంచేసే చర్యలకు కొందరు సీనియర్లు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం చాలా కష్టం అన్నారు. అధిష్టానం నిర్ణయం కోసం ఇంకా ఆలస్యం చేయలేం అన్నారు. తెలంగాణ శక్తులతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇందులో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.