జూనియర్ ఫ్లెక్సీ రాజకీయం !!

Jr NTR flexకృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ విభిన్నంగా, వినూత్నంగా వుంటాయి. ఓ పట్టాన ఎవరికీ అంతుపట్టవు కూడా. ప్రస్తుతం జిల్లాలో ఫ్లెక్సీ రాజకీయాలు ఊపందుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల రాక సందర్భంగా ఆమెకు స్వాగతం పలుకుతూ నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు వివాదాస్పద చర్చలకు దారి తీస్తున్నాయి. షర్మిల, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ తదితర నాయకులతో బాటు ఈ ఫ్లెక్సీలపై జూనియర్ ఎన్.టి. ఆర్. బొమ్మ కూడా వుండటం ఈ వివాదాలకు ప్రధాన కారణం. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉంటూ, స్వయానా దేశం రాజ్యసభ సభ్యుడు, నందమూరి తారక రామారావు తనయుడయిన నందమూరి హరికృష్ణ కుమారుడయిన జూనియర్ బొమ్మ ఫ్లెక్సీ పైన ఉండటంతో వివాదం చెలరేగింది. ఫ్లెక్సీ పై తన ఫోటో ముద్రించుకునేందుకు జూనియర్ అనుమతి ఇచ్చారా, లేక ఆయనకు తెలియకుండా ఆయన తో వున్న స్నేహంతో గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని ఈ సాహసానికి ఓడిగట్టారా అన్నది ఇప్పటివరకు సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో ఒంటరివాడై పోతున్న జూనియర్ ఈ సంఘటన వల్ల దేశం క్యాడర్ కు మరింత దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయానికి నగరంలో మరికొన్ని చోట్ల జగన్ పార్టీ ఫ్లెక్సీలపై జూనియర్ ఫోటోలు కనిపించటం, ఇప్పటి వరకూ దీనిని జూనియర్ ఖండించక పోవటం వల్ల ఈ ఫ్లెక్సీలకు ఆయన అనుమతి ఉందనే భావనకు క్యాడర్ రాకతప్పని పరిస్థితి ఏర్పడింది.

Balakrishna Family @ Jr NTR, Lakshmi Pranathi Marriage 4” స్వతహాగా జూనియర్ మంచివాడే…. కాని కొడాలి నాని లాంటి వారు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారు.” అని ఓ దేశం నాయకుడు వ్యాఖ్యానించారు. ” అయినా ఎవరో తప్పుదారి పట్టిస్తే మాత్రం ఆ దారిలో వెళ్లేందుకు జూనియర్ చిన్నపిల్లాడు కాదు …. ” అని ఆయనే అన్నారు. ” నాకు, జూనియర్ కూ మధ్య ఎలాంటి విభేదాలూ లేవు.. మేమంతా ఒక్కటే ” అని స్వయంగా దేశం నాయకుడు, చంద్రబాబు బావమరది నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఈ ఫ్లెక్సీల వ్యవహారంలో జూనియర్ మౌనం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మరి ఈ విషయంలో అధిష్టానం జూనియర్ తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దకపోతే క్యాడర్ మరింత గందరగోళానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. అన్ని విషయాల్లో ” ముందుకు పోదాం ” అని చెప్పే చంద్రబాబు ఈ విషయంలో ఏ మేరకు ముందుకు పోతారో చూడాల్సిందే!!!