Site icon TeluguMirchi.com

ప్రజల చెంతకే ఉద్యోగ అవకాశాలు

cbn-ap-rajadani
నేషనల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం తన కార్యాలయంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ కార్ఫొరేషన్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించారు. జాతీయ స్థాయిలో గుర్తించిన 42 రంగాలలో స్థానిక పారిశ్రామిక వేత్తల నేతృత్వంలో దీనిని ఏర్పాటు చేయాలన్నారు. ఉన్న నైపుణ్యాల మెరుగుకు, నూతన నైపుణ్యాల వృద్దికి, ఇది దోహద పడుతుందన్నారు. వారి సామర్ద్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, ఉత్పత్తి పెంచేందుకు, లోపాలను అధిగమించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నైపుణ్యాభివృద్ది కేంద్రాలతో పాటుగా హబ్ అండ్ స్పోక్ విధానంలో 6 క్లస్టర్‌లలో 36 ఎక్సలెన్స్ సెంటర్ లను ఏర్పాటు చేసినట్టుగా స్కిల్ డెవెలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, న్యూజిలాండ్‌లలో నైపుణ్యాభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసినట్లుగా తెలిపారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుపాక్చరింగ్ (ఈఎస్.డీ.ఎమ్) కింద 14 కోర్సులలో 15000 మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చామన్నారు. అన్ని జిల్లాలలో 1000 మంది విద్యార్ధుల చొప్పున శిక్షణ ఇస్తున్నామన్నారు. ఐటి శిక్షణకు నాస్కామ్ తో ఎంవొయూ చేసుకున్నామన్నారు. గిరిజన ప్రాంతాలలోని యువతకు బహుళ నైపుణ్యాలను పెంచేందుకు ఎంవోయూలు చేసుకునే అంశంపై కృషి చేస్తున్నామన్నారు. 2016 మార్చి నాటికి 3000 మంది విద్యార్ధులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలలో 20000 మందిని ఎంపిక చేసి 14 రంగాలలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 10 క్లష్టర్‌లలో 5000 మంది మహిళలకు చేతి వృత్తులలో శిక్షణ ఇస్తున్నామన్నారు. టాటా స్ట్రైవ్, మెకింజీ సోషల్ ఇనీషియేటివ్, ఎటీడీసి, టాలీ ఈఆర్ పీ, చికాగో విశ్వవిద్యాలయం, ఐబియం స్నైడర్ ఎలక్ట్రిక్, బాస్, ఫెస్టో తదితర సంస్థలు ఇందులో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వచ్చాయన్నారు.

యువత, మహిళల నైపుణ్యాలను పెంచడంలో ఏపీఎస్ ఎస్ డీసీ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. అన్ని శాఖలు ప్రోసెస్ చార్టులను రూపొందించి, లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి అమలు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. స్కిల్, స్కేల్, స్పీడ్ పైనే దృష్టిని కేంద్రీకరించాలన్నారు. రాష్ట్రంలో నెలకొల్పబోయే పరిశ్రమల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నైపుణ్యాలను అభివృద్ది చేయాలన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా, స్థానికంగా కావలసిన నైపుణ్యాలను అద్యయనం చేసేందుకు కన్షల్టెంట్ లను నియమించుకోమని సూచించారు. నైపుణ్యం పొందిన యువత, మహిళలకు సంబందిత పరిశ్రమలలో ఉద్యోగాలను కల్పించే ఏజన్సీలను గుర్తించాలని ఆదేశించారు.
విద్యార్ధులలో అంతర్గత ప్రతిభను గుర్తించి ఏఏ రంగాలలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ఉపాధి పొందవచ్చో సూచించే వారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఉద్యోగాల వద్దకు ప్రజలను చేర్చడం కాకుండా, ప్రజల వద్దకే ఉద్యోగ అవకాశాలను చేరువ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

ఈ సమీక్షలో మంత్రి శ్రీ అచ్చెంనాయుడు, ఏపీఎస్ఎస్ డీసీ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావు, సీఈఓ గంటా సుబ్బారావు, డైరెక్టర్ లక్ష్మినారాయణ, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయి ప్రసాద్ ఇతర అధికారులు, అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version