విభజన అనివార్యంగా మారింది !

jpవిభజన అంటూ అధికారం కోసం పోరాడుతున్నామా? లేక ప్రజా శ్రేయస్సు కోసమా? ఏది ముఖ్యమని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రావనిలో రాజకీయాలు అంపశయ్యపై ఉందని అన్నారు. రాష్ట్ర విభజనతో పచ్చని నేలపై చిచ్చు రేగిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు.

‘నా బాల్యం మహారాష్ట్రలో…విద్యాభ్యాసం కోస్తాంధ్రలో…. ఐఏఎస్ శిక్షణ కరీంనగర్ లో….అసెంబ్లీకి ఎన్నికైంది హైదరాబాద్ నుంచి …. ఇంతకీ నేను ఇప్పుడు ఏ ప్రాంతానికి చెందినవాడినో చెప్పాలని’ అన్నారు. మన అస్థిత్వం అవసరం. కాని శ్రుతి మించిన అస్థిత్వం ప్రమాదకరమని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీలు లేవు.. ప్రాంతాలు మాత్రమే మాట్లాడుకుంటున్నాయని విమర్శించారు. అన్ని వర్గాల్లో ప్రాంతీయ భేదం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇన్ని విభేదాల మధ్య కలసి ఉండడం అసాధ్యమని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష బలమైనదని, అందుకే లోక్ సత్తా పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిలో రాష్ట్రం సమైక్యంగా కొనసాగడం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రజల భవిష్యత్తు ద్రుష్టి లో వుంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని, బలవంతంగా కలిపి ఉంచలేమని అన్నారు. ప్రస్తుత పరిస్థిలో విభజ అనివార్యం అయ్యిందని వివరించారు.

‘మూడు ప్రాంతాల్లో ఎవరు బాధపడ్డా మరొకరు తల్లడిల్లాలి’

తాము సూచించిన సవరణలతో బిల్లును తీసుకొస్తే తెలంగాణకు గుండెకు గాయమైతే కోస్తా కన్నీరు కారుస్తుంది. రాయసీమ రక్తమోడితే తెలంగాణ తల్లడిల్లుతుంది. కోస్తా బాధపడితే రాయసీమ తల్లడిల్లుతుందని తెలిపారు. ఎవరికీ నష్టం కలగని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించినప్పుడే విభజనను కోరుకుందామని అన్నారు.