Site icon TeluguMirchi.com

నేత‌న్నల సంక్షేమం జ‌న‌సేన‌తోనే సాధ్యం

* అస్తమిస్తున్న త‌రాల‌కు ప్రతినిధులు చంద్రబాబు, లోకేశ్
* ఉద‌యిస్తున్న త‌రానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రతినిధి
* ఆడ‌ప‌డుచులు బ‌య‌ట‌కొచ్చి మాట్లాడ‌ట‌మే మార్పునకు సంకేతం
* నేత‌న్నల స‌మ‌స్యల‌పై ఫిబ్రవ‌రిలో ప్రత్యేక స‌ద‌స్సు
* చేనేత కార్మికుల స‌మావేశంలో జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు

అస్త‌మిస్తున్న త‌రాల‌కు చంద్ర‌బాబు, లోకేశ్ లు ప్ర‌తినిధులైతే.. ఉద‌యిస్తున్న త‌రానికి నేను ప్ర‌తినిధిని అని జ‌న‌సేన పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య స‌మ‌రయోధుల ఆశ‌యాలను, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నారు. నన్నెవరూ న‌మ్మ‌డానికి సిద్ధంగా లేని స‌మ‌యంలో ఆడ‌ప‌డుచులు, జ‌న‌ సైనికులే న‌మ్మార‌ని, స‌మ‌స్య‌ల మీద మాట్లాడ‌టానికి ఆడ‌ప‌డులు బ‌య‌టికి రావ‌డ‌మే మార్పునకు సంకేతం అన్నారు. గురువారం ఉద‌యం అమ‌లాపురం స‌త్య‌నారాయ‌ణ ఫంక్ష‌న్ హాల్లో చేనేత కార్మికుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా చేనేత కార్మికులు త‌మ క‌ష్టాల‌ను శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి ముందు ఉంచారు.
చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల‌తో పోల్చితే మ‌న రాష్ట్రంలో చేనేత ప‌రిశ్ర‌మ అత్యంత దారుణ‌మైన ప‌రిస్థితిలో ఉందని, చేనేత స‌మ‌స్య‌లు ప్ర‌స్త‌వించ‌డానికి చట్ట సభల్లో ఒక్క నాయ‌కుడు కూడా లేడ‌న్నారు. చేనేత సంక్షేమానికి రూ. 338 కోట్లు కేటాయించిన ప్ర‌భుత్వం కేవ‌లం నాలుగున్న‌రేళ్ల‌లో కేంద్ర ప్ర‌భుత్వ నిధులు క‌లుపుకుని రూ. 153 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం ఆప్కో బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో 650 చేనేత సొసైటీలు దుర్భ‌ర‌ స్థితిలో ఉన్నాయని, మార్కెట్ లో పెరుగుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా చేనేత‌ల‌కు నైపుణ్యం మెరుగుప‌ర‌చ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. నూలుపై 5 శాతం జీఎస్టీ విధించ‌డం వ‌ల్ల గ్రామాల్లో మ‌గ్గాల సంఖ్య త‌గ్గిపోయింద‌ని, జీఎస్టీ ర‌ద్దు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఉపాధి హామీ ప‌నుల‌కు రోజుకు రూ. 150 వ‌స్తుంటే.. మ‌గ్గం నేసే కార్మికుడికి రూ. 60 కూడా మించి రావ‌డం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

చేనేత వృత్తితో కుటుంబ పోష‌ణ క‌ష్టంగా మారింద‌ని, రెండు పూటలా తిండి కరువై దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామ‌ని వాపోయారు. చేనేతల సంక్షేమానికి రూ. 1000 కోట్ల‌తో ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. భ‌విష్య‌త్తుపై ఆశ న‌శించి నేత‌న్న నీర‌సించి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని క‌న్నీరుపెట్టారు. చేనేత కార్మికుల క‌ష్టాలను విన్న అనంత‌రం శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు మాట్లాడారు.

‘చేనేత చాలా అరుదైన క‌ళ‌. చేనేత కార్మికులు అనే ప‌దం వాడ‌టం ఇష్టం లేదు. వారిని చేనేత క‌ళాకారులు అన‌డమే ఇష్టం. ఆక‌లి తీర్చే అన్న‌దాత త‌ర్వాత అంత ముఖ్య‌మైన‌వాడు… మానం కాపాడే నేత‌న్న‌. అటువంటి నేత‌న్న‌లు ద‌శాబ్దాలుగా ప‌డుతున్న క‌ష్టాలు బాగా తెలుసు. చీక‌ట్లో మ‌గ్గంపై నేసి నేసి కంటి చూపు మంద‌గించ‌డం, టెన్నిస్ ఎల్బో వంటి అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. నాయ‌కుల‌కు ఆ క‌ష్టం తెలియ‌క‌పోవ‌డంతోనే చేనేత ప‌రిశ్ర‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ అని చెప్ప‌డానికే పంచె క‌డ‌తాను. ఈ క‌ట్టు, బొట్టు, వేషం మిమ్మ‌ల్ని గౌర‌వించ‌డానికి, మీ క‌ష్టాల‌ను గుర్తించాం అని చెప్ప‌డానికి. ఎమ్మెల్యే, ఎంపీలు, యువ‌త చేనేత ఉత్పత్తులు ధ‌రించాలి. రెడీమేడ్ వ‌స్ర్తాలు ధ‌రించేంత కాలం నేత‌న్న‌ల క‌ష్టాలు తెలియ‌వు. ఎర్ర‌ తువ్వాలను ఒక సినిమాలో పెట్ట‌డం వ‌ల్ల ఫ్యాష‌న్ అయిపోయింది. అలాగే స‌రైన తీరులో అంత‌ర్జాతీయ మార్కెట్లోకి చేనేత ఉత్ప‌త్తుల‌ను తీసుకెళ్తే అవే ఫ్యాష‌న్ అవుతాయి. వారికి ల‌బ్ధి చేకూరుతుంది. వారి జీవితాలు బాగుప‌డ‌తాయి. పూర్వం నాయ‌కులు అన్ని కులాలు, మ‌తాలు, వృత్తుల‌ను స‌మానంగా చూసేవారు. కుల‌వివ‌క్ష ఉండేది కాదు. మ‌న చ‌చ్చు నాయ‌కుల వ‌ల్ల ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అలా లేవు. అన్ని కులాల‌వారు రాజ‌కీయ ప్రాధాన్యం కోరుకుంటున్నారు. చేనేత కళాకారులు కూడా చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రవేశం క‌ల్పించండి అని అడుగుతున్నారు. మీ బాధ‌, వ్య‌ధ‌, క‌ష్టాన్ని చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌తిబింబించే విధంగా ప్రాతినిధ్యం ఉండాలి. అయితే జిల్లాలో మూడు స్థానాలు ఇవ్వాల‌ని కోరుతున్నారు. కేవ‌లం చ‌ట్ట‌స‌భ‌ల్లో రెండు, మూడు సీట్లు ఇస్తే చేనేత‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌దు. చాలా మంది కుల‌ నాయ‌కులు చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లారు. వారు బాగుప‌డ్డారు కానీ, కులాలు బాగుప‌డ‌లేదు. తాము కూడా సోష‌ల్ జ‌స్టిస్ పేరుతో 2009లో ఇలా చేసే దెబ్బ‌తిన్నాం. అనుకున్న ఆశ‌యాలను నెర‌వేర్చ‌లేక‌పోయాం, చేసిన‌ దానికి ఎవ‌రూ కూడా మావెంట నిల‌బ‌డ‌లేదు. చేనేత‌ల‌కు ఎన్నిసీట్లు ఇస్తాం అనేదానికంటే మీకు అండ‌గా ఉంటాను . గెల‌వ‌గ‌లిగే సామ‌ర్ధ్యం ఉంటే క‌చ్చితంగా సీటు ఇస్తాను. కుద‌ర‌ని ప‌క్షంలో నామినేటెడ్ పోస్టులు ఇస్తాను.

ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ఉంటే చేనేత క‌ష్టాలు గురించి ప్ర‌స్తావించేవారు. ముఖ్య‌మంత్రి కొడుకవ్వ‌డం వ‌ల్ల లోకేశ్ గారు మంత్రి అయిపోయారు. వీళ్ల‌కు చేనేత క‌ష్టాలు ఏం తెలుస్తాయి. ఒక చేనేత ఆడ‌ప‌డుచును ప‌క్క‌న కూర్చొబెట్టుకుని మాట్లాడ‌గ‌ల‌రా..? వారి బాధ ఓపిక‌గా విన‌గ‌ల‌రా..?. ముఖ్య‌మంత్రి మాటలు వినండి.. నేను రోడ్లు వేయించాను, నేను ఉద్యోగాలు ఇస్తున్నానంటూ మాట్లాడ‌టం సిగ్గుచేటు. ఆయ‌న‌కు జ‌న‌సేన అంటే భ‌యం ప‌ట్టుకుంది. తెలంగాణా ఎన్నిక‌ల్లో సైతం జ‌న‌సేన నామ‌స్మ‌ర‌ణే చేస్తున్నారు. చేనేత నాయకులు సైతం వృత్తి సంబంధించిన విషయాలకు అంకితం అవ్వాల్సిందిపోయి పార్టీల‌కు అంకిత‌మ‌వుతున్నారు. అందువ‌ల్ల న్యాయం జ‌ర‌గ‌డం లేదు. మ‌న వృత్తికి అండ‌గా నిల‌బ‌డే నాయ‌కుల‌ను జ‌న‌సేన తీసుకొస్తుంది. చేనేత ప‌రిశ్ర‌మ‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంది. బ‌డ్జెట్ లో వెయ్యి కోట్లు, చేనేత రుణాల మాఫీ, మాతృసంస్థ ఆప్కోకు 1000 కోట్లు పెట్టుబ‌డి, హెల్త్ కార్డులు , ఇన్సూరెన్స్, ఉపాధి హామీ ప‌థ‌కం వ‌ర్తింప‌చేయ‌డం వంటి డిమాండ్లను అర్థం చేసుకున్నాను. జ‌న‌వ‌రి చివ‌రి వారంలో లేదా ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌త్యేక స‌ద‌స్సు ఏర్పాటు చేసి నేత‌న్న క‌ష్టాల‌పై అధ్యయనం చేసి చేనేత ప‌రిశ్ర‌మ‌పై అంత‌రంగాన్ని ఆవిష్క‌రిస్తాన‌”ని హామీ ఇచ్చారు.

Exit mobile version