Site icon TeluguMirchi.com

175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధం – పవన్ కళ్యాణ్

* పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు
* బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేద్దాం
* తెలంగాణ పోటీ ప్రణాళికఆగస్టులో వెల్లడి
* సగటు మనిషి… అణగారిన వర్గాల గొంతు మన జనసేన
* పార్టీ చీఫ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా దేవ్ నియామకం
* దేవ్ కు సహకరించనున్న 1200 మంది నాటి సి.పి.ఎఫ్. సంస్థ కార్యకర్తలు
* ముఖ్య కార్యకర్తలతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి పార్టీ సర్వ సన్నద్ధంగా ఉందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. పక్కాగా రూపొందిస్తున్న ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేద్దామని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో 13 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య రాజకీయ వ్యూహకర్త శ్రీ దేవ్ గారిని పరిచయం చేశారు. ఎన్నికల ప్రణాళికలు, సంస్థాగత నిర్మాణపరమైన విధానాల రూపకల్పనకు దేవ్ పార్టీతో ఉంటారనీ, గత పది నెలలుగా జనసేనకు పని చేస్తున్నారు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పార్టీకి అనుభవం లేదు అనే మాట ప్రత్యర్ధులు అంటారుగానీ… జనసేనకు పార్టీగా అనుభవం లేకపోవచ్చు… పార్టీలోని ప్రతి కార్యకర్తకీ రెండు ఎన్నికల్లో క్రియాశీలంగా ఉన్న అనుభవం ఉంది అని చెప్పండి.

జనసేన పార్టీకి మనది తొలి తరం. అందరం మధ్యతరగతి, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మన పార్టీకి లక్షల మంది అన్ని ఊళ్లలో ఉన్నారు. క్రమశిక్షణతో, బలమైన భావజాలంతో జనసేననిర్మితమవుతోంది. కొద్దిమంది చేతుల్లో, కొన్ని కుటుంబాల చేతుల్లోనే రాజకీయాలు ఉండిపోవడంతో అభివృద్ధి, వాటి ఫలాలు ఆంధ్రరికీ చేరడం లేదు. అందరికీ న్యాయం జరగడం లేదు. సగటు మనిషి… అణగారిన వర్గాల బలమైన గొంతు మన జనసేన పార్టీ. గత ఎన్నికల్లో 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాల్లో, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నా- తరవాతి పరిస్థితుల్లో ఎన్.డి.ఏ. కు సహకరించాం. ఒక ఎంఎల్ఏ గా పోటీ చేసేముందు క్షేత్ర స్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఇబ్బందులపై అవగాహన అవసరం అన్నది నా ఉద్దేశం. అవేవి లేకుండా పోటీ చేసి గెలిస్తే, ఎప్పటికీ నేర్చుకొనే అవకాశం ఉండదు. గిరిగీసుకొని కూర్చొని, సంప్రదాయ విధానాల్లో రాజకీయాలు చేసేవారికి మన జనసేన పంథా అర్థం కాదు. పార్టీ సిద్దాంతాలను ఎంతో లోతుగా అధ్యయనం చేసి రూపొందించాం. కులాల ఐక్యత అనేది మన తొలి సిద్దాంతం. ఒక కులానికి ఒక కులం పరస్పర ఆధారంగా నిలవాలి. జనసేన పార్టీ ఏ ఒక్క కులానికో ప్రాతినిధ్యం వహించదు. కులం అనే భావనే వుంటే తెలుగు దేశం పార్టీకి ఎలా సహకరిస్తాం? కులాలకు అతీతంగా ఆలోచన చేద్దాం. కుల, మత సామరస్యం కాపాడటం ముఖ్యం అని నమ్మే పార్టీ జనసేన. ఈ పార్టీ ప్రతిభావంతులైన కార్యకర్తలకి వేదికగా నిలిచేలా చేస్తున్నాం. బలమైన మేధస్సుతో కూడిన కార్యకర్తలున్నారు. ఇది ఓ కుటుంబం, కులానికి సంబంధించిన పార్టీ కాదు. ఎన్నికల్లోకి వెళ్ళేందుకు, ఎన్నికల సమయంలో అనుసరించే విధివిధానాలకి మన పార్టీకి ప్రొఫెషనల్ సహకారం అవసరం ఉంది. అందుకే శ్రీ దేవ్ గారిని ముఖ్య రాజకీయ వ్యూహకర్తగా తీసుకున్నాం. ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల తరవాత వారి సేవల్ని వినియోగించుకుంటాం. మన జనసేన కొద్ది స్థానాల్లోనే పోటీ చేస్తుందని ఎప్పుడూ చెప్పలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సి.పి.ఎఫ్.) ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు దేవ్ టీం కలసి ఎన్నికల ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారు. 1200 మంది సిపిఎఫ్ కార్యకర్తలు దేవ్ కు సహకరిస్తారు. 350 మందితో దేవ్ టీమ్ ఉంటుంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీలు ఎలా ముందుకు వెళ్లాలో బలమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. మరో వైపు తెలంగాణకి సంబంధించి క్యాడర్ ను బలోపేతం చేస్తున్నాం. ఆగస్ట్ రెండో వారం నాటికి తెలంగాణలో పోటీకి సంబంధించి ప్రాధమిక ప్రణాళిక ప్రకటిస్తాం.

త్వరలో ప్రజల మధ్యలోకి…

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా సమస్యలను తెలియపరచేలా ప్రజల మధ్యలోకివెళదాం. ఈ నెల 11 వ తేదీలోగా ఈ పర్యటనలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను. ఏ వూరు నుంచి ఈ యాత్ర ఉండేది అప్పుడు చెబుతాను. ప్రకటించిన 48 గంటల్లోగా ప్రజల మధ్యలో ఉంటాను” అన్నారు.

బలమైన భావజాలానికి పటిష్ట వ్యూహం తోడు: దేవ్

జనసేన ముఖ్య రాజకీయ వ్యూహకర్త శ్రీ దేవ్ గారు ముఖ్య కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడుతూ “జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలసిన అనుభవం ఉంది. ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నాను. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయే సీజన్డ్ పొలిటీషియన్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి ప్రజా సమస్యలపట్ల, సామాజికాంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. జనసేన పార్టీకి బలమైన భావజాలాన్ని, సిద్దాంతాల్ని రూపొందించారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఇందుకు బూత్ స్థాయి నుంచి పకడ్బంది ప్రణాళికలు వేసుకోవాలి. నా టీమ్ కు మీ అందరి సహకారం అవసరం. రాజకీయంగా ఉత్తేజితులై అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, సిద్దాంతాల్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే అంశాలతోపాటు ఎన్నికల వరకూ అనుసరించే వ్యూహాల్ని మీతో ఎప్పటికప్పుడు పంచుకొంటాను. జనసేన ప్రజలతో మమేకమయ్యే పార్టీ. అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేద్దాం” అన్నారు.

Exit mobile version