Site icon TeluguMirchi.com

జనసేన ప్రధాన కార్యదర్శిగా శ్రీ తోట చంద్రశేఖర్


మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ తోట చంద్రశేఖర్ ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మ‌రోసారి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియ‌మించారు. రెండుసార్లు లోక్‌సభకు పోటీ చేసిన శ్రీ తోట చంద్రశేఖర్ గారిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. శుక్రవారం హైద‌రాబాద్ లోని కేంద్ర కార్యాల‌యంలో శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “చంద్రశేఖర్ గారితో గత పదేళ్లుగా నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఇంకా స‌ర్వీసు ఉండ‌గానే ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అదే క‌మిట్మెంట్ తో ప‌ని చేశారే త‌ప్ప వెనుదిరిగి వెళ్ల‌లేదు. ఆయ‌న అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ‌లేక‌పోయినా బ‌లంగా నిల‌బ‌డ్డారు. ఈసారి ఆయ‌న విజ‌యానికి అంద‌రం కృషి చేసి చ‌ట్ట‌స‌భ‌ల్లోకి తీసుకెళ్తాం. ఆయ‌న విజ‌యం జ‌న‌సేన పార్టీతోపాటు నాకు అమిత‌మైన ఆనందం క‌లిగిస్తుంది. పౌర పరిపాలనలో ఆయనకున్న పట్టు, శక్తి సామర్థ్యాలు అపారమైన‌వి. ఆయన దక్షత పార్టీని మరింత విస్తృతపరచడానికి ఉపయోగపడుతుంది. ఆయ‌న అపార అనుభ‌వం జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాకు మ‌రింత హుందా చేకూర్చుతుంది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఇంకోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించినందుకు జ‌న‌సైనికులు, కార్య‌క‌ర్త‌లు, వీర మ‌హిళ‌ల త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను” అన్నారు. శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. “జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి వ్య‌క్తిత్వం, ఆశ‌యాలు, సిద్ధాంతాలు చూసి ఆకర్షితులైన ల‌క్ష‌లాదిమందిలో నేనూ ఒకణ్ణి. 1987లో సివిల్స్ కు సెల‌క్ట్ అయి అపాయింట్మెంట్ లెట‌ర్ తీసుకున్న‌ప్పుడు ఎంతో ఆనందించానో అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఈ రోజు ఆనందం క‌లుగుతోంది. శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి చేతుల మీదుగా సెల‌క్ట్ అవ్వ‌డం అంటే ఆ వ్య‌క్తిలో ప్ర‌జ‌ల‌కు సేవ చేసే గుణం ఉంటేనే సెల‌క్ట్ చేస్తారు. ప్ర‌తి రోజు రాత్రి రెండు, మూడు వ‌ర‌కు ప‌ని చేసినా ఆయ‌న ముఖంలో అల‌స‌ట క‌నిపించ‌డం లేదు. ఆయ‌న చుట్టూ ఉన్న మేము మాత్రం అలసిపోతున్నాం. ఈ క‌ష్టం భ‌విష్య‌త్తులో మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంది. శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి లాంటి నాయ‌కులు దొర‌క‌డం చాలా అరుదు. ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయ‌న‌లోని ప‌రిప‌క్వ‌త‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయ‌న‌కున్న ఉన్న విజ‌న్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అవుతారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి అవ్వ‌కుండా ఏ శ‌క్తి అడ్డుకోలేదు. ఆయ‌న చూపించిన దారిలో వెన్నంటే న‌డ‌వ‌డానికి, సైనికుడిలా ప‌ని చేయ‌డానికి సాయ‌శ‌క్తుల కృషి చేస్తాను” అన్నారు.

* పార్టీ అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శిగా శ్రీ పి.హరిప్రసాద్

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు శ్రీ పి.హ‌రిప్ర‌సాద్ గారిని మ‌రోసారి రాజకీయ కార్య‌ద‌ర్శి గా జ‌న‌సేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియ‌మించారు. శుక్రవారం హైద‌రాబాద్ లోని కేంద్ర కార్యాల‌యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శ్రీ హ‌రిప్ర‌సాద్ గారు నాకు 10 ఏళ్లుగా తెలుసు, ఆత్మీయులు. ఆయ‌న్ను రాజ‌కీయ కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌డం చాలా ఆనందంగా ఉంది. పార్టీ నిర్మాణం చాలా వేగంగా జ‌రుగుతుంది అంటే దాని వెన‌క ఆయ‌న అమోఘ‌మైన కృషి ఉంది. మ‌రికొద్ది రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న చాలా బ‌ల‌మైన పాత్ర పోషిస్తార‌ని విశ్వ‌సిస్తున్నాను. ఆయ‌న‌కున్న విజ్ఞ‌త, సౌమ్యం చూసి నా ప‌క్కనే ఉండాల‌ని కోరుకున్నాను. అందుకే ఎక్క‌డో ఉద్యోగం చేస్తున్న ఆయ‌న్ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చాను. ఆయ‌న విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు, సంప్ర‌దింపులు జ‌ర్న‌లిజంలో ఆయ‌న‌కున్న‌ అనుభ‌వం ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రాజ‌కీయ కార్య‌ద‌ర్శి ప‌ద‌వి స్వీక‌రించినందుకు హ‌రిప్ర‌సాద్ గారికి ధ‌న్య‌వాదాలు” అన్నారు. శ్రీ హ‌రిప్ర‌సాద్ గారు మాట్లాడుతూ.. “లా చ‌దువుకుని, జ‌ర్న‌లిజం బ్యాగ్రౌండ్ తో వ‌చ్చిన నాకు జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి రాజ‌కీయ కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌డం జీవితంలో మ‌రుపురాని రోజు. ఈ ప‌ద‌వికి ఎంత‌మాత్రం అర్హుడిని కాద‌ని నాకు తెలుసు. శ్రీ పవ‌న్ క‌ళ్యాణ్ గారు కోరుకుంటే ఒక విశాంత్రి ఐఏఎస్ ఆఫీస‌రో, మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలో సీఈవోగా ప‌ని చేసినవారినో నియ‌మించుకోవ‌చ్చు. కానీ నా మీద ఉన్న న‌మ్మ‌కం, అంత‌కుమించి ఉన్న ప్రేమ‌తో నాకు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆయ‌న్ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌నుకునే కోట్లాదిమందిలో నేను ఒకణ్ణి . ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యే విధంగా సాయ‌శ‌క్తులా,శ‌క్తివంచ‌న లేకుండా త్రిక‌ర‌ణ‌శుద్ధిగా కృషి చేస్తాను. ఈ ప‌ద‌వి నాకు ఇచ్చినందుకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను”అన్నారు.

* జ‌న‌సేన ‘ప్రెసిడెంట్స్ సోష‌ల్ వెల్ఫేర్ ప్రోగ్రాం’ చైర్మన్ గా శ్రీ రాధా మాధవ్

జ‌న‌సేన పార్టీ ‘ప్రెసిడెంట్స్ సోష‌ల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్’ చైర్మ‌న్‌గా శ్రీ రాధామాధవ్ ని పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు నియ‌మించారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌కి ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ సంద‌ర్బంగా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ”అగ్రిక‌ల్చ‌ర్‌ ఎంఎస్సీ, సోష‌ల్ సైన్సెస్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ చేసిన శ్రీ రాధామాధవ్ గ‌త కొన్నేళ్లుగా జ‌న‌సేన పార్టీలో మాతో క‌ల‌సి ప‌ని చేస్తున్నారు. తిత్లీ తుపాను స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కి ఎలా సేవ‌లు అందించాలి అనే అంశంలో ఆయ‌న రూపొందించిన ప్రోగ్రామ్ మేర‌కే ఛారిటీ వ‌ర్క్స్ న‌డిచాయి. జాతీయ విప‌త్తులు, ఉప‌ద్ర‌వాలు సంభ‌వించిన స‌మ‌యంలో ప్‌‌జ‌ల‌కి ఏదైనా చేయ‌డానికి ప్రోగ్రామ్ డిజైన్ చేయ‌గ‌ల సామ‌ర్ధ్యం ఆయ‌న‌కి ఉంది. కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కి చేర‌డానికి శ్రీ రాధామాధవ్ స‌ల‌హాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. నా విన్న‌పాన్ని ఒప్పుకున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను” అన్నారు. శ్రీ రాధామాధవ్ మాట్లాడుతూ.. “ఓ రాజ‌కీయ పార్టీ సమాజం మీద దృష్టి పెట్ట‌డం ఇదే మొద‌లు. అది జ‌న‌సేన పార్టీతో మొద‌లుపెట్ట‌డం ఆనందంగా ఉంది. నా అనుభ‌వాన్ని ఉప‌యోగించి పార్టీ అధ్య‌క్షులు నా మీద పెట్టుకున్న న‌మ్మ కాన్ని నిల‌బెడ‌తాన‌”న్నారు.

Exit mobile version