Site icon TeluguMirchi.com

చిత్తశుద్దితో ప‌నిచేసే జ‌న‌ సైనికుల‌కి కమిటీల్లో చోటు : జనసేనాని


రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావాలంటే బ‌ల‌మైన సంక‌ల్పం ఉంటే చాలని, వేల‌ కోట్లు డ‌బ్బున్న వ్య‌క్తులు, అప‌రిమిత‌మైన జ్ఞానం ఉన్న మేథావులు అవ‌స‌రం లేద‌ని జ‌న‌సేన పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు పేర్కొన్నారు. జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడు కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వ్య‌క్తులుగానీ, మేథావులుగానీ లేర‌ని, కుళ్లు రాజ‌కీయాల‌పై క‌డుపు మండిన సామాన్యులు మాత్ర‌మే ఉన్నార‌ని గుర్తు చేశారు. సారా వ్యాపారులు, బ్రాందీ వ్యాపారుల కబంద‌హ‌స్తాల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లా చిక్కుకుపోవ‌డంతో అభివృద్ధి కుంటుప‌డింద‌న్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి వేళ్లూనుకుపోయిన‌ వారి అవినీతిని కూక‌టివేళ్ల‌తో పెక‌లించ‌డానికి కొత్త త‌రాన్ని రాజ‌కీయాల్లోకి తీసుకొస్తామ‌న్నారు. గురువారం విశాఖపట్నంలోని సాయిప్రియా రిసార్ట్ లో విజ‌య‌న‌గ‌రం జిల్లా కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “విజ‌య‌న‌గ‌రం జిల్లా అంటే నాకు ప్రియ‌మైన జిల్లా. పోరాట‌ యాత్ర‌లో భాగంగా విజ‌య‌న‌గ‌రం వెళ్తే జోరువాన‌లో కూడా నా కోసం త‌డుస్తూ నిల‌బ‌డ్డారు. మీ కోసం నా ప్రాణ‌మిచ్చినా త‌క్కువే అనిపించింది. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ‌, అభిమానాన్ని- విజ‌య‌న‌గ‌రం జిల్లా అభివృద్ధికి, నిరుద్యోగుల ఉపాధికి, మ‌హిళ‌లకు భ‌ద్ర‌త క‌ల్పించే బ‌ల‌మైన శ‌క్తిగా మ‌ల‌చేందుకు వినియోగిస్తా. రాజులు, మ‌హారాజులు, కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన సారా వ్యాపారులు ఉన్నా పెద‌పెంకి గ్రామంలో బోదకాలు వ్యాధిని నివారించ‌లేక‌పోయారు. రాజ‌కీయం వ్యాపారంగా మారిపోయింది. కోట్లు సంపాదించ‌డానికి రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు.

జ‌న‌సేన పార్టీలోకి వెళ్తే ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలి త‌ప్ప, అవినీతికి పాల్ప‌డి డ‌బ్బు సంపాదించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో కొంతమంది నాయ‌కులు మ‌న పార్టీలోకి రావ‌డం లేదు. జ‌న‌సేన పార్టీకి ఉన్న యువ‌శ‌క్తి, మ‌హిళ‌శ‌క్తిని రాజ‌కీయ శ‌క్తిగా గుర్తించ‌డానికి మిగిలిన పార్టీ నాయ‌కులు ఇష్ట‌ప‌డ‌టం లేదు. జ‌న‌సేన‌కు బ‌ల‌మైన స్థానాలు సంపాదించి పెట్టే జిల్లా విజ‌య‌న‌గ‌రం జిల్లా. దానిని అర్ధం చేసుకుని ముందుకు తీసుకెళ్లే నాయ‌కులు మ‌న‌కు లేరు. అయిన ఫ‌ర్వాలేదు. జ‌న‌ సైనికుల నుంచే నాయ‌కుల‌ను త‌యారు చేస్తాను. జిల్లా, మండ‌ల, గ్రామ‌ స్థాయిలో కొత్త ర‌క్తం రాజ‌కీయాల్లోకి తీసుకొస్తాం.

జ‌న‌సేన పార్టీని ఒక ఎన్నిక‌ల‌ కోసం స్థాపించ‌లేదు. రెండున్న‌ర దశాబ్దాలు పోరాటం చేయ‌డానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. పోరాటం చేసినవాడికి గెలుపు వ‌రిస్తుంది త‌ప్ప‌, పారిపోయినోడికి కాదు. జ‌న‌సేన ఓటు బ్యాంక్ 5 శాతం, 3 శాతం అంటూ కొంద‌రు అవాకులుచెవాకులు పేలుతున్నారు. ప‌డ్డ‌వాడు ఎప్పుడూ చెడ్డ‌వాడు కాదు. రాయి శిల్పంగా మారాలంటే ఎన్నో ఉలి దెబ్బ‌లను తినాలి. ప‌డ‌తాం, లేస్తాం, నిల‌బ‌డ‌తాం చివ‌ర‌గా మార్పు తీసుకొస్తాం. జ‌న‌సేన పార్టీలోని నాయ‌కులు ప‌గ‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో రాత్రి వేరే పార్టీతో ఉంటే తెలియ‌ద‌ని అనుకోకండి. మ‌మ్మ‌ల్ని, మా న‌మ్మ‌కాన్ని పెట్టుబ‌డిగా పెట్టి రాజ‌కీయాల్లో ఎదుగుదాం అంటే చూస్తూ ఊరుకోం. నేను ఒక నిర్ణ‌యం తీసుకుంటే లోతుగా విశ్లేషించి నిర్ణ‌యం తీసుకుంటా, పార్ల‌మెంట్ క‌మిటీల్లో చిత్త‌శుద్ధితో ప‌నిచేసే జ‌న‌సైనికులకు చోటు క‌ల్పిస్తామ‌”ని హామీ ఇచ్చారు.

Exit mobile version