యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలి


2019 ఎన్నిక‌ల కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్న‌ట్టు జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు స్ప‌ష్టం చేశారు. పార్టీ శ్రేణులు అనుస‌రించ‌డానికి అవ‌స‌ర‌మైన నియ‌మావ‌ళి రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. గురువారం విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హించారు. ఎన్నిక‌ల నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు. సంబంధిత జిల్లాల కో-ఆర్డినేట‌ర్లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో విడివిడిగా జిల్లాకి మూడు స‌మావేశాలు చొప్పున నాలుగు గంట‌ల పాటు సుదీర్ఘంగా సాగాయి. జ‌న‌వ‌రి మాసాంతంలోగా ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కి సంబంధించి ఓ ప్రాంతీయ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్టు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు తెలిపారు.

• శ్రీకాకుళం జిల్లా పార్టీ శ్రేణుల‌తో..

శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన స‌మీక్షా స‌మావేశం ఉద‌యం 10 గంట‌ల‌కి ప్రారంభం అయ్యింది. ముందుగా జిల్లా కో-ఆర్డినేట‌ర్ల‌తోనూ, అనంత‌రం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తోనూ విడివిడిగా పార్టీ అధినేత స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ… జ‌న‌సేన పార్టీకి విశేషంగా ఉన్న యువ‌శ‌క్తిని రాజ‌కీయ శ‌క్తిగా మార్చాలని పిలుపునిచ్చారు. పార్టీ వ‌ర్కింగ్ క్యాలెండ‌ర్‌కి రూప‌క‌ల్ప‌న చేస్తామ‌ని తెలిపారు. దాన్ని జిల్లా క‌మిటీలు సమర్థంగా అమ‌లు చేయాల‌న్నారు. జిల్లాలో అన్ని కులాల వారు జ‌న‌సేన‌ని అభిమానిస్తున్నార‌ని, కులాల మ‌ధ్య స‌యోధ్య‌ని మ‌రింత పెంచాల్సిన‌ అవ‌స‌రం జ‌న‌సేన శ్రేణుల‌పై ఉంద‌న్నారు. జిల్లాలో అభివృద్ది చెందుతున్న కులాల వారికి అండ‌గా ఉంటూనే వెనుక‌బ‌డిన కులాల వారిని ముందుకి తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పార్టీ ప్ర‌తినిధిగా బ‌హిరంగంగా మాట్లాడేప్పుడు సంస్కార‌వంత‌మైన భాష మాట్లాడాల‌ని, పార్టీ నియ‌మావ‌ళికి అనుగుణంగా అభిప్రాయాలు ఉండాల‌ని సూచించారు. యువ‌త‌కు సాధికారిత క‌ల్పించ‌డానికి రాజీలేని ధృడ చిత్తంతో ప‌ని చేయాల‌న్నారు. పార్టీ సిద్ధాంతాలతోపాటు, మేనిఫెస్టోలోని హామీలను ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతంతోపాటు పార్టీ గుర్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆదేశించారు. పార్టీని ఇంటింటికీ తీసుకెళ్లే కార్య‌క‌ర్త‌లే త‌న బ‌ల‌మ‌ని, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అంద‌రూ సిద్ధంగా ఉండాలన్నారు. ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు గుర్తింపు లభించే విధంగా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని తెలిపారు. వ్య‌క్తిగ‌త అజెండా కాకుండా పార్టీ అజెండాతో ముందుకి వెళ్లాల‌న్నారు.

• విశాఖపట్నం జిల్లా శ్రేణులతో…

మ‌ధ్యాహ్నం విశాఖ‌ప‌ట్నం జిల్లా బాధ్యులు, కార్య‌క‌ర్త‌ల‌తో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు స‌మావేశం అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం కొన్ని కుటుంబాల చేతిలో ప‌రిమితం అయినందునే జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం జ‌రిగింద‌న్నారు. 2014లో జ‌న‌సేన పార్టీ ప్రారంభించిన‌ప్పుడు అతి కొద్ది మంది నేత‌లు, సుమారు 150 మంది అనుచ‌రులు మాత్ర‌మే ఉన్నార‌నీ, ఇప్పుడు ఇన్ని ల‌క్ష‌ల మంది అభిమానం చూర‌గొన‌డం పార్టీ మీద పెరుగుతున్న న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు. రాజ‌కీయాల్లో మార్పు తీసుకొచ్చి తీరుదామని చెప్పారు. వృత్తిప‌రంగా తాను క‌ళాకారుణ్ణి అయిన‌ప్ప‌టికీ ప్ర‌వృత్తిప‌రంగా రాజ‌కీయవేత్త‌నన్నారు. త‌న‌కు ప‌ని చేసుకుని వెళ్ల‌డం త‌ప్ప ఓట‌మి భ‌యాలు లేవ‌న్నారు. ప్ర‌తి గ్రామాన్ని రెండు పార్టీలు పంచుకున్నాయ‌నీ, ఈ పరిస్థితికి చరమగీతం పాడుతూ మూడో ప్ర‌త్యామ్నాయంగా జ‌న‌సేన పార్టీ అవ‌త‌రించింద‌ని శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు జ‌న‌సేన త‌మ‌తో క‌లిసి పోటీ చేస్తుందని ప్ర‌చారం చేసుకోవ‌డం జ‌న‌సేన బ‌లాన్ని తెలియ‌చేస్తుంద‌న్నారు. ఉత్సాహం ఉర‌క‌లెత్తే యువ‌శ‌క్తే జ‌న‌సేన‌కి కొండంత అండ‌నీ , వారి కార‌ణంగానే గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా కోట్లాది రూపాయలు ఖ‌ర్చుపెట్ట‌కుండానే అనేక బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌గ‌లిగిన‌ట్టు చెప్పారు. జ‌న‌సేన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి ధ‌న బ‌లాన్ని న‌మ్మ‌డం లేద‌ని, కార్య‌క‌ర్త‌ల్ని మాత్ర‌మే న‌మ్ముతుంద‌ని స్ప‌ష్టం చేశారు. శ్ర‌మ ప‌డ‌కుండా విజ‌యం సాధ్యం కాద‌ని, రానున్న ఎన్నిక‌ల్లో నేత‌లంతా స‌మష్టి పోరాటంతో ఏక‌తాటిపై ముందడుగు వేయాల‌ని పిలుపునిచ్చారు. నాయ‌కుల్లో చిత్త‌శుద్ధి ఉంటే వారి వెంట యువ‌త ప‌య‌నిస్తార‌నీ, నాయ‌కుల‌కి ఓర్పు, స‌హ‌నం అవ‌స‌ర‌మ‌నీ సూచించారు. క‌లుషిత‌మైన ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో జ‌వాబుదారీత‌నం తీసుకురావ‌డ‌మే జ‌న‌సేన ల‌క్ష్య‌మ‌న్నారు. సైద్ధాంతిక పోరాటంతోనే జ‌న‌సేన మ‌నుగ‌డ సాగిస్తుంద‌నీ, కార్య‌క‌ర్త‌లు సైతం ఇదే మార్గంలో ప‌య‌నించాల‌ని కోరారు. ఈ స‌మీక్షా స‌మావేశాల్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ స్పీక‌ర్‌, జ‌న‌సేన ముఖ్య‌నేత శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్ గారు, ప‌లువురు పార్టీ ముఖ్య నేత‌లు పాల్గొన్నారు.

జిల్లాల వారీ స‌మీక్షా స‌మావేశాల్లో భాగంగా శుక్ర‌వారం రెండు జిల్లాల‌కి చెందిన కో.ఆర్డినేట‌ర్లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు స‌మావేశం అవుతారు.