ఓ స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్జీఓ) స్థాపించినంత మాత్రాన ప్రతి సమస్యకీ పరిష్కారం చూపలేం. రాజకీయ నాయకుడిగా పాలసీలు రూపొందించడం ద్వారా మాత్రమే ఆ అవకాశం ఉంటుందని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్‌కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. రాజకీయాల పట్ల ఎన్జీవోల నిర్వాహకులకి సైతం సానుకూల దృక్పథం అవసరం అన్నారు. భూసేకరణ లాంటి బలమైన చట్టాలు ఎన్జీవోల చొరవతో వచ్చినవేనని తెలిపారు. గురువారం విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలోని సాయిప్రియా రిసార్ట్ లో ఎన్జీవోల నిర్వాహకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా పలు స్వచ్చంద సంస్థల నిర్వాహకులు పాలసీల రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు ఎన్జీవో నిర్వహణలో ఉన్న ఇబ్బందులని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు. వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “దేశంలో ఇంకా మానవత్వం అనేమాట బతికి ఉంది అంటే దానికి ఎన్జీవోలే కారణం. ప్రభుత్వాలు ఎంతో కొంత పని చేస్తున్నాయన్నా దాని వెనుకా ఎన్జీవోల కృషి దాగి వుంది. చిన్నతనం నుంచి నాకు మీలాంటి తపనే ఉండేది. సమాజానికి ఏదో చేయాలన్న బలమైన ఆకాంక్ష ఉండేది. సాధ్యమైనంత చేశాను కూడా. కొన్నేళ్ల క్రితం ఓ ఎన్జీవోతో కలసి నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం చూపుదామని ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకులు అడ్డుకున్నారు. మనకున్న విశాల దృక్పథం అందరికీ ఉండకపోవచ్చు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ తనకి తోచిన సాయం చేయాలన్న కాంక్ష ఉంటుంది. అయితే ఆ సేవాగుణాన్ని వెలికి తీసే స్థాయిలో వ్యవస్థల నుంచి మద్దతు అవసరం. ఉద్దానం సమస్యకి పూర్తిగా పరిష్కారం చూపలేకపోయినా, అక్కడ సమస్యని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లగలిగాం. సమస్యపై ప్రభుత్వానికి అవగాహన కల్పించగలిగాం. ఎంతోకొంత కదలిక తీసుకురాగలిగాం. సిఎం నుంచి ప్రభుత్వం వరకు కదలిక వచ్చిందంటే అక్కడ సమస్యను కళ్లకు కట్టేలా చూపడమే కారణం. కులం, మతం, ప్రాంతం అంటూ గొడవలు చేద్దాం రమ్మంటే ఎవరైనా వస్తారు. జవాబుదారీతనంతో కూడిన మార్పు తీసుకువద్దామంటే మాత్రం ఎవరూ ముందుకి రారు. ఎవరి స్థాయిలో వారు రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావాలి. జనసేన పార్టీ మీ అందరికీ ఓ గొంతుక ఇస్తుంది. అది సమస్యలకు పరిష్కారాలు చెప్పేందుకు, సమస్యలని వెలికి తీసేందుకు దోహదపడాలి. అదే లక్ష్యంతో జనసేన పార్టీ సిటిజన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు నేరుగా తమ అభిప్రాయాలు వ్యక్తపరిచే అవకాశం కల్పించాం. ప్రతి ఒక్కరు పాలసీల రూపకల్పనలో భాగస్వాములు కావచ్చు. ఎన్జీవో నిర్వాహకులు ఎత్తి చూపిన ప్రతి సమస్యనీ పార్టీ పాలసీల్లో పెడతాం. ఎన్జీవోల సూచనలతో పాలసీలు అమలు పర్చాల్సిన అవసరం ఉంది. ఎన్జీవోల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందర్నీ సమంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే అది పేపర్లకే పరిమితం అవుతోంద”న్నారు.
Home వార్తలు ఆంద్రప్రదేశ్ వార్తలు మానవత్వం అనే మాట బతికి ఉంది అంటే స్వచ్ఛంద సంస్థలే కారణం : జనసేనాని