నిర్ణయం మారితే తీవ్రం పరిణామాలు !

janareddyతెలంగాణ ఆకాంక్ష అన్నది ఇప్పటిది కాదని, 60 ఏళ్ల నాటిదని మంత్రి జానారెడ్డి అన్నారు. ఈరోజు (సోమవారం) ఉదయం తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో జానారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర అభినందనీయం అని ఆయన కొనియాడారు. ఉద్యమంలో బలిదానాలు చేసుకున్న వారికి జానారెడ్డి జోహార్లు తెలిపారు. సీమాంధ్ర ప్రజల బాధను అర్దం చేసుకుంటున్నామని, కాని తెలంగాణ అన్నది రాత్రికి, రాత్రి జరిగింది కాదని.. అరవై ఏళ్లుగా సాగిన చరిత్ర అని ఆయన అన్నారు. తెలుగు ప్రజల అబివృద్దిని కాంక్షించే తెలంగాణపై నిర్ణయం జరిగిందని.. ఏదో ఒకపక్క ఎప్పుడో ఒకప్పుడు ఆవేశానికి గురి అయినా తెలుగు జాతి భవిష్యత్తు బాగుండాలనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని జానా చెప్ప్పుకొచ్చారు.

2009 డిసెంబర్ 9 తర్వాత తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గినప్పటికీ మూడేళ్లు ఓపిక పట్టామని, తాము ఆవేశానికి లోను కాలేదని అన్నారు. ఎక్కడో ఒక చోట తప్ప పెద్దగా సమస్యలు రాలేదని అన్నారు. అలాగే ఇప్పుడు మళ్లీ నిర్ణయం మారితే ఇక్కడ కూడా పరిణామాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని, అది మానవాళికే మంచిది కాదని జానారెడ్డి చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్ర విభజన అని జానారెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉండేలా కృషి చేద్దామని తెలిపారు. తెలంగాణ నిర్ణయం పునఃపరిశీలన అసాధ్యమని, దీనిని అందరూ గుర్తించాలని జానారెడ్డి అన్నారు.