Site icon TeluguMirchi.com

జైపాల్ రెడ్డి రాజీనామా..?

jaipal-reddyకాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి  జైపాల్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాధాన్యత గల పెట్రోలియం శాఖ నుండి మంత్రి పదవి మార్చిన అనంతరం కూడా జైపాల్ రెడ్డి ఎక్కడా అసంతృప్తిని ప్రదర్శించిన దాఖల్లేవు. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేయకుంటే జైపాల్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేసి కాంగ్రెస్ లోనే కొనసాగాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా అంశంపై జైపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెసు ఎంపీలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన అనంతరం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని టీ-ఎంపీలు జైపాల్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తోంది.

కాగా, తెలంగాణపై మే నెలాఖరులోగా తేల్చాలని తెలంగాణ ఎంపీలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. మే నెలలోగా తేల్చకుంటే రాజకీయ సమీకరణాలు మారుతాయని ఆ లేఖలో హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జైపాల్ రెడ్డి, జానా రెడ్డిలతో పాటు మంత్రులు, అధికార పార్టీ తెలంగాణ నేతలను తెలంగాణవాదులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణవాదులు జైపాల్ రెడ్డి, జానారెడ్డి లాంటి సీనియర్ తెలంగాణ నేతలను టార్గెట్ చేసుకుంటే పరిస్థితి విషమిస్తుందని భావించినందువల్లే జైపాల్, జానా రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లుగా సమాచారం.

Exit mobile version