న్యూయార్క్ 9/11, ముంబై 26/ 11 వంటి ఘటనలు మళ్లీ జరగడానికి ప్రపంచం అనుమతించదని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఉగ్రవాద చర్యల వల్ల అంతర్జాతీయ శాంతి భద్రతకు ముప్పు-గ్లోబల్ కౌంటర్ టెర్రరిజంపై ముందుకు వెళ్లే మార్గం’ అనే అంశంపై న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం రాజకీయ విభేదాలను అధిగమించి జీరో-టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శించాలని, ఉగ్రవాదం నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు ఏ ఒక్క దేశమూ ప్రయత్నించకూడదని ఆయన ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి జవాబుదారీతనం పునాదిగా ఉండాలి. ఉగ్రవాద నిరోధక ఎజెండాను తిరిగి ఉత్తేజపరిచేందుకు భద్రతా మండలిలో భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఐక్యరాజ్య సమితి బ్రీఫింగ్ అని ఆయన అన్నారు. టెర్రరిజం ముప్పు మరింత తీవ్రంగా మారిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.