మరో ‘పీఆర్ పీ’ గా జగన్ పార్టీ

ysrcpతెప్పలుగా చెరువునిండిన కప్పలు పదివేలు చేరు అన్నాడు సమతీకారుడు, కొత్తగా పెట్టిన రాజకీయపార్టీలకు రెండు రకాల అనుభవం ఎదురవుతుంది. ఒకటి అంతగా పేరు ప్రతిష్ట లేకపోతే, గేటు దగ్గర నిల్చుని పార్టీలో సభ్యత్వానికి ఎవరు వస్తారా? అని ఎదురు చూడడం. లేదూ.. మాంచి ఊపుమీద వుంటే, వచ్చే వాళ్లను తట్టుకోలేక తలపట్టుకోవడం.

గతంలో పీఆర్ పీ, ఇప్పుడు జగన్ పార్టీకి ఎదురైన తలనొప్పి ఇదే. మెగాస్టార్ చిరంజీవి కొత్తగా పార్టీ పెడితే, అంత వరకు ఏ పార్టీ తీర్థంలేని రాజకీయ ఆకాంక్షితులందరూ, అదే చాన్స్ అంటూ ముందుకొచ్చేశారు. ముఖ్యంగా యువకులు, ఔత్సాహికులు, కాస్త డబ్బు చేసినవారు, పార్టీ ప్రారంభించిడంతోనే వచ్చి చేరిపోయారు. పార్టీకి ఫ్లెక్సీలు కట్టి, బైకు ర్యాలీలు తీసి, నానా హంగామా చేసి హైప్ తీసుకొచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గం ఎంచుకుని టిక్కెట్ విషయంలో తమకు ఎవరూ పోటి రారనుకుని సంబరపడ్డారు.

సరిగ్గా ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసరికి, పంచెలు సవరించుకుంటూ, పంట్లాల పైకి లాక్కుంటూ, మిగితా పార్టీల నుంచి దిగుమతులు ప్రారంభమయ్యాయి. ఆశవాహులంతా అవాక్కయ్యారు. నోట మాట రాలేదు. టిక్కెట్ల పంపిణీ ప్రారంభమయింది. ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నాలు, గొడవలు, పోలీసుల హడావుడి. చివరకు టిక్కెట్లు అమ్ముకున్నారన్న్న అప్రతిష్ట నెత్తిన పడింది. ఇప్పుడు జగన్ పార్టీ కూడ ఆ దిశగానే ప్రయాణిస్తున్న వైఖరి కనిపిస్తోంది. అధికారం లేని వారు, మొన్నటి ఎన్నికల్లో ఓడినవారు, గెల్చినా, ఓడినా జగన్ అంటే ప్రాణాలిచ్చేంత అభిమానం వున్నవారు అతగాడి పార్టీకి వెన్నుదన్నుగా వున్నారు.

వీరిలో రెండు రకాల జనాలు వున్నారు. ఒకరకం స్వతహాగా వారి వారి ప్రాంతాల్లో తగిన స్టామినా వుండి, ఏ పార్టీ టిక్కెట్ గెలవగలిగివారు. రెండో రకం, ఏదో ఒకపార్టీ టిక్కెట్ ఇవ్వడమే గొప్ప అనుకునేవారు. ఇలాంటి వారిని కూడా జగన్ పార్టీ ఎందుకు చేరదీసింది అంటే, ప్రారంభంలో కాస్త జనాలు కనపడాలి కదా అని. పైగా ఇలాంటి చోట మోటా నాయకులు ఏం మాట్లాడినా, ప్రకటనలు ఇచ్చినా సాక్షి మీడియా నెత్తిన పెట్టుకు మోసింది. దీంతో వీళ్లందరిలో తమను మించిన వారు లేరన్నంత ధీమా వచ్చేసింది. మరోపక్క జగన్ జైలులో వుండడంతో పార్టీకి పెద్దదిక్కుగా వున్న కొంతమంది నాయకులు ఇలా చోటామోటా వారికి ఎవరికి తోచిన హామీలు వారు ఇచ్చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు దగ్గరకు వస్తుండడంతో ఇతరపార్టీల నుమ్చి వలసలు ప్రారంభమయ్యాయి.

ఇప్పుడు కథ క్లైమాక్స్ చేరుకుంటోంది. వున్నవారు, రాబోతున్నవారు, వచ్చి చేరుతున్న వారి నడుమ కుమ్ములాటలు రాజుకుంటున్నాయి. దీంతో జగన్ పార్టీ సెకెండ్ గ్రేడ్ నాయకులకు తలనొప్పి కట్టింది. నిజానికి తమ చేతిలో ఏమీ లేదని, అంతా జగన్ దేనని వారికి తెలుసు. కానీ ఇనాళ్లూ బిల్డప్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అది కాస్తా బయటపడింది. జగన్ వారిపై బుస్సుమంటున్నాడని వినికిడి. ఇప్పటికే సుబారెడ్డిని ఇలాంటి కారణాలతోనే అక్కన పెట్టాడని తెలిసింది. అంటే ఇన్నాళ్లూ టిక్కెట్ ఆశలు పెట్టుకున్నవారి కథ మళ్లీ మొదటికి వచ్చినట్లే. ఇతర పార్టీల నుంచి వలసలు అన్నీ పూర్తయ్యాక, అప్పుడు బలాబలాను బట్టి, మదుపును దృష్టిలో వుంచికునిన టిక్కెట్ల కేటాయింపు చేయడం అన్నది సహజం. ఇలాంటి కుస్తీకి ఇప్పటిదాకా వున్న చోటామోటాలు తూగగలరా అంటే అనుమానమే.

అంటే మళ్లీ ఆంధ్ర జనాలు చూసిన సినిమానే చూసినట్లు, పీఆర్ పీ స్టయిక్ల్ వ్యవహారాలనే మళ్లీ మరోసారి చూడాలి. ఇప్పటికే జనాన్ని ఓట్లుగా మార్చే క్షేత్రస్థాయి యంత్రాంగం లేక జగన్ పార్టీ పీఆర్ పీ కి నకలు అన్న పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ వ్యవహారాలతో సిసలైన జిరాక్స్ అనిపించుకుంటుంది. రేపు ఫలితాల్లోనైనా తేడా చూపించుకుంటే.. ఇంక ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంటుంది.?