Site icon TeluguMirchi.com

జగన్ సాయం కోరిన కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సాయం కోరారు. తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆ వర్షాల దెబ్బ నుంచి కోలుకోక మునుపే మళ్లీ వర్షాలు పడుతుండటం.. రానున్న నాలుగైదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో కేసీఆర్ సర్కార్ మరింత అప్రమత్తమైంది.

భారీ వర్షాలతో ఇప్పటికే హైదరాబాద్ అతలాకుతలమవ్వడం, మళ్లీ అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. భాగ్యనగరంలో వరద సహాయ పునరావాస చర్యలకై స్పీడ్ బోటులు పంపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరింది. ఈ అభ్యర్థనకు తక్షణమే సీఎం స్పందించారు. వెంటనే స్పీడు బోట్లను పంపాలని విపత్తుల నిర్వహణ సంస్థ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి మూడు, పర్యాటక శాఖ ద్వారా ఐదు మొత్తం ఎనిమిది స్పీడు బోటులను వెంటనే హైదరాబాద్‌ పంపిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా ఈ స్పీడ్ బోటులతో పాటు ఆయా బోటుల సామర్థ్యానికి అనుగుణంగా ఎస్డీఆర్ఎఫ్‌కు సంబంధించిన ఈతగాళ్లను (డ్రైవర్స్), తగినన్ని లైఫ్ జాకెట్లను పంపుతున్నట్లు అధికారులు తెలియజేశారు.

Exit mobile version