ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించారు. ఈ నెల 24న జీరో వడ్డీ పథకాన్ని పునఃప్రారంభించబోతుంది. ఈ పధకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.1,400 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం కరోనా తో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్న సమయంలో .. ఆగిపోయిన ఈ పథకానికి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అందర్నీలో ఆనందం కలిగిస్తుంది.
ఈ పథకానికి సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు ప్రభుత్వం తాజాగా రూ.765.19 కోట్లను విడుదల చేసింది. మిగిలిన నిధులను ప్రభుత్వం గతంలోనే సెర్ప్, మెప్మాలకు విడుదల చేసింది. పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు సోమ, మంగళవారాల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
డ్వాక్ర మహిళలతో పాటు ఆశా వర్కర్లు, వాలంటీర్లకు జగన్ సర్కార్ తీపి కబురు అందించారు. కరోనా బీమా పరిధిలోకి వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు సహా ముందువరుసలో పనిచేస్తున్న వారందరినీ తీసుకురావాలని అధికారుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యల్లో సేవలు అందిస్తున్నారని.. వారికి అండగా, భరోసా నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు.