జగన్ బెయిల్ విచారణ మరోసారి వాయిదా

jagan-bail-petitionవైకాపా అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని సీబీఐ కోర్టును కోరింది. 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీం కోర్టుకు సీబీఐ లిఖితపూర్వకంగా తెలియజేసిన గడువు ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం బెయిలుపై విచారణ మొదలుకాగా… సీనియర్ న్యాయవాది తమకు అందుబాటులో లేరని, అందువలన విచారణను ఈ నెల 18వ తేదీకి గానీ, 21వ తేదీకి గానీ వాయిదా వేయాలని సీబీఐ కోరింది. దీనికి జగన్ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాదులు చాలామంది ఉన్నారని, ఒకరు కాకుంటే మరొకరిని తెచ్చుకోవాలి తప్ప ఆ కారణంతో బెయిలు రాకుండా చేయాలనుకోవటం సరికాదని చెప్పారు. ఇది బెయిలును జాప్యం చేసే ఎత్తుగడే తప్ప మరొకటి కాదన్నారు. కోర్టు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా విచారణను వాయిదా వేసింది. అయితే రేపటి నుంచి కోర్టుకు సంక్రాంతి సెలవులు కనుక అనంతరం ఈ కేసుపై విచారణ జరగనుంది.