ఇదే ఆఖరు భేటీ కాదు!

shindeరాష్ట్ర విభజనపై ఏర్పడిన మంత్రుల బృందం రేపు (బుధవారం) మరోసారి సమావేశం కానున్న విషయం తెలిసిందే. అయితే, విభజన నివేదికపై స్పష్టత వచ్చిందని, నివేదికకు అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం కూడా లభించిందనే వార్తల నేపథ్యంలో.. రేపు జరగబోయే సమావేశమే జీవోఎం ఆఖరు సమావేశమని అందరు భావించారు. అయితే, రేపు జరగబోయే సమావేశమే ఆఖరు సమావేశం కాదని జీవోఎంకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 9.00గంటల వరకు విసృతంగా చర్చలు జరుపుతామని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే దిశగా నివేదికను రూపొందించే పనిలో వున్నామని షిండే అన్నారు.

జీవోఎం సమావేశం పై గతంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్, షిండే వేరు వేరు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. జైరాం రమేష్ ఇదే చివరి జీవోఎం సమావేశం అంటే… లేదు లేదు మరికొన్ని భేటీలు జరుగుతాయి. పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలస్యమైన ఫర్వాలేదు అని షిండే పేర్కొన్నారు. తాజాగా, రేపే జీవోఎం చివరి సమావేశమని అందరూ భావించినప్పటికినీ.. లేదు ఇది ఆఖరు భేటీ కాదని షిండే పేర్కొనడం మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది.

మరోవైపు, శుక్రవారం జరగాల్సిన కేబినేట్ సమావేశాన్ని ఒకరోజు ముందు అంటే.. గురువారం నాడే నిర్వహిస్తున్నారు. కేబినేట్ మీటింగ్ ఒకరోజు ముందే నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి.. ? రేపు జరగబోయే జీవోఎం సమావేశంలో విభజన నివేదికను ఆమోదించిన వెంటనే.. మరునాడు జరిగే కేబినేట్ సమావేశంలో పెడతారా.. ? అన్న అనుమానం కలుగుతోంది. అయితే, విభజన విషయంలో కేంద్రం
అవలంభించే పంథా ఎవరికీ అంతుపట్టడం లేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుకోవడం విశేషం.