రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీది కీలకపాత్ర. ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికిటెక్నాలజీ వెన్నెముక లాంటిదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.నవ్యాంధ్రలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి వీలుగా ప్రోత్సాహకాలతో ఐటీ పాలసీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి బ్లూ ప్రింట్ ను విడుదల చేసిన విషయం విదితమే.
గురువారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం.. రాష్ట్రంలో ఐటి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించింది. ఐటి పాలసీలో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల ఏర్పాటుకు వ్యవస్థీకృత కార్యాలయం లేదు. ఐటి కేంద్రం నిర్మాణం అయ్యేదాకా ప్రైవేటు భవనాలలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవటానికి
ఔత్సాహిక కంపెనీలు ప్రోత్సాహకాలకు, రాయితీలకు ఎదురు చేస్తున్నాయి. ఈ క్రమంలో వారికి రాయితీలు ఇవ్వటానికి మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీలో ఐటి పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఈ దిగువ ప్రకటించిన ప్రోత్సాహకాలను ఇవ్వటానికి తీర్మానించింది.
1.ఏడాదికి రూ. 10 లక్షలకు లోబడి ఏదైనా ఐటి టెక్నాలజీ పార్కులో కార్యాలయం ఏర్పాటుచేసుకునే సంస్థలకు లీజ్ రెంటల్స్ లో 50శాతం రీయింబర్సుమెంట్ సదుపాయం. ఈ రాయితీ మూడేళ్లపాటు లభిస్తుంది. ఉపాధి అవకాశాలను కల్పించే సంస్థలకు మరింత ప్రాధాన్యం వుంటుంది.
2. ఇంటర్‌నెట్ సర్వీసు ప్రొవైడర్ కు కంపెనీలు చెల్లించే బ్యాండ్ విడ్త్ చార్జిలలో (ఏడాదికి రూ. 15 లక్షల పరిమితికి లోబడి) 25% రీయింబర్సుమెంట్ సదుపాయం. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి మూడు సంవత్సరాల పాటు ఈ అవకాశం.
3. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల పాటు నిర్ణీత కరెంటు చార్జిలు యూనిట్ ఒక్కింటికి రూ.1- చొప్పున రీయింబర్సుమెంట్.
4. ఐటి, ఐటిఇఎస్ యూనిట్లు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకాలలో నూరు శాతం మినహాయింపు. పరిశ్రమలకు వర్తింపజేసే టారిఫ్ వర్తింపు.
5. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖలో సబ్ రిజిస్ట్రార్ కు చెల్లించిన స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రియింబర్సుమెంట్ నూరు శాతం రీయింబర్స్‌మెంట్ వస్తుంది.
బి) 1. ప్రైవేటు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు, డెవలపర్లు, బిల్డర్లు, ఓనర్లు, లీజుదార్లకు ఈ కిందివిధంగా మూడేళ్ల పాటు వర్తింపజేసే రాయితీలు ఇస్తారు.
1) ఐటి ఆఫీసులు నిర్మించే స్థానిక మునిసిపాలిటీ అధికారులకు చెల్లించే ఆస్తి పన్నులో 50 శాతం రీయింబర్స్‌మెంట్.
2) ఐటి కంపెనీలకోసం నిర్మించే భవనాలకు 50 % ఇన్సురెన్స్ ప్రీమియం.
3) ఐటి కంపెనీల కోసం నిర్మించే భవనాలకు నిర్వహణా చార్జీలలో 50.4% రియింబర్స్‌మెంట్ కు అవకాశం.
4) ఆడియో,వీడియో సిస్టమ్స్, ప్రొజెక్షన్, సర్వర్ రూమ్, కేఫెటేరియా లతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు నిమిత్తం వన్ టైమ్ కాస్ట్ లో రూ.10 లక్షలకు మించకుండా 50% రియింబర్సుమెంట్.
5) ఐటి భవనాలు నిర్మించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు, డెవలపర్లు, బిల్డర్లు,లీజుదార్లకు ఆర్ధిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలో 10% రియింబర్సుమెంట్.
సి) కొత్తగా ఏర్పాటు చేసే ఐటి కంపెనీలలో రెండేళ్ల పాటు ఉద్యోగికి రూ.2 వేల చొప్పున పిఎఫ్ రియింబర్సుమెంట్. (రెండేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగి వుంటే)
డి) విధాన మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ వెలువడిన ఏడాది లోపు ఐటి కంపెనీలు, యూనిట్లు, డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కులకు ఈ పాలసీ వర్తిస్తుంది.