తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ గురువారం మంత్రి సబితా విడుదల చేసారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను ఈ ఏడాది ఒకేసారి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 లక్షల 65 వేల 839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల వెల్లడి సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ సారి ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయి అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత ఉత్తీర్ణత శాతం రావడం ఇదే తొలిసారి అన్నారు. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 62 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణత శాతం 60.01గా ఉండగా దీనిలో బాలికలు 67.47 శాతం అదేవిధంగా బాలురు 52.30 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లాకు అగ్రస్థానం దక్కగా.. 75 శాతంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది.