అమెరికా-కెనడా సరిహద్దుల్లో భారతీయ కుటుంబం మృతి

అమెరికా-కెనడా సరిహద్దులో విషాదం చోటు చేసుకుంది. మంచుతో నిండిన ప్రాంతంలో ఓ భారతీయ కుటుంబం మృత్యువాత పడింది. కెనడా భూభాగం నుంచి అమెరికా గడ్డపైకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో మంచు ధాటికి వారు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎమర్సన్ ప్రాంతం వద్ద కెనడా భూభాగంలో వారి మృతదేహాలను గుర్తించారు. సరిహద్దుకు కొన్ని మీటర్ల దూరంలోనే ఓ పురుషుడు, స్త్రీ, ఒక టీనేజర్, ఒక శిశువు మృతదేహాలు పడి ఉన్నాయి.

అమెరికా వైపున బోర్డర్‌ వద్ద ఓ వ్యాన్‌లో ఇద్దరు భారతీయులతో వస్తున్న స్టీవ్‌ శాండ్ అనే వ్యక్తిని యూఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యాన్‌లో భారీ మొత్తంలో స్నాక్స్‌, డిస్పోజబుల్‌ పేట్లు, కప్పులను గుర్తించారు. మరికొందరు బోర్డర్‌ దాటబోతున్నారన్న సమాచారంతో కెనడా బోర్డర్‌ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టిన కెనడా సిబ్బందికి.. మంచులో కూరుకుపోయిన మృతదేహాలు కనిపించాయి.